పుట:Mana-Jeevithalu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాటలు

101

మనకెంత ముఖ్యమైపోయాయి. దేశం, దైవం, మతప్రవక్త, ప్రజాప్రభుత్వం, విప్లవం. ఆ మాటల్లోనే మనం జీవిస్తూ అవి సృష్టించే అనుభూతులతో ఆనందాన్ని పొందుతాం. ఈ అనుభూతులే అంత ముఖ్యమైపోయాయి. మాటలు మనకి తృప్తి కలిగిస్తాయంటే, వాటి ధ్వనులు మరిచిపోయిన అనుభూతులను మళ్ళీ మేల్కొల్పుతాయి. వాస్తవికతకు బదులు మాటలే ప్రత్నామ్నాయమైనప్పుడు వాటివల్ల కలిగే తృప్తి మరింత ఎక్కువగా ఉంటుంది. మన అంతరంగంలోని శూన్యతని ఆ మాటలతో, ఆ ధ్వనితో, చప్పుళ్లతో, కార్యకలాపంతో నింపుతాం. సంగీతం, మంత్రపఠనం మన నించీ, మన అల్పత్వాన్నుంచీ, విసుగుదల నుంచీ పారిపోవటానికి సుఖసాధనలు. మన గ్రంథాలయాల నిండా మాటలే. అంతులేకుండా ఎలా మాట్లాడతాం! ఓ పుస్తకం లేకుండా, ఏ పని చేస్తూ ఉండకుండా ఏకాంతంగా ఉండటానికి సాహసించలేము కూడా. మనం ఎకాంతంగా ఉన్నప్పుడు మనస్సు అశాంతిగా ఉంటుంది - ఇటూ అటూ అంతటా తిరుగుతూ, ఆదుర్దాపడుతూ, జ్ఞాపకం చేసుకుంటూ, కొట్టుకుంటూ. అందుచేత ఏకాంతమనేది ఎప్పుడూ ఉండదు. మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు.

ఏదో మాటనో, మంత్రాన్నో, ప్రార్థననో జపిస్తూ మనస్సుని నిశ్చలం చేయవచ్చును. నిస్సంశయంగా, మనస్సుకి మత్తు కలిగించి నిద్రపుచ్చవచ్చు. ఎంతో సంతోషకరంగా గాని, హింసాత్మకంగా గాని మనస్సుని నిద్రపోయేటట్లు చేయవచ్చు. నిద్రలో కలలు రావచ్చు. క్రమశిక్షణ ద్వారా, పూజ ద్వారా, జపం ద్వారా శాంతపరచిన మనస్సు ఎన్నటికీ చురుకుగా, సున్నితంగా, స్వేచ్ఛగా ఉండదు. ఈ విధంగా మృదువుగా గాని మోటుగా గాని, మనస్సుని బాదటం ధ్యానం కాదు. మంత్రాలు పఠించటం, బాగా పఠిస్తూంటే వినటం ఆనంద దాయకంగానే ఉంటుంది. కాని, అనుభూతి మరో అనుభూతికి ఆధారమవుతుంది. అనుభూతి భ్రమకి దారితీస్తుంది. మనలో చాలామంది భ్రమలలో బ్రతకటానికే ఇష్టపడతారు. ఇంకా తీవ్రమైన, విస్తారమైన భ్రమలను కనుక్కోవటంలో ఆనందం ఉంటుంది. కాని, ఆ భ్రమలను పోగొట్టుకుంటామన్న భయమే నిజాన్ని, వాస్తవాన్ని కప్పిపెట్టి, దాన్ని కనిపించకుండా చేస్తుంది. వాస్తవికతని అర్థం చేసుకునే శక్తి మనకి లేక కాదు. వాస్తవికతని