పుట:Mana-Jeevithalu.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
103
ఊహ, యథార్థం

కాకపోయినా. ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. ఆవిడ ఆయన మీద ఆధారపడింది. అందువల్ల ఆయన పైన ఆధిపత్యం చూపించకుండా ఉండలేదు. ఆవిడకి పిల్లల్లేరు కనుక ఆవిడ తీర్చుకోదలుచుకున్నదంతా ఆయనతోనే. కానీ, ఆయనకి ఆ శక్తి లేదు. ఆవిడే అన్నీ నిర్వహించాలి. అందుకే ఆవిడకి నిరాశ. ఆయన ఆఫీసులో అన్నీ చాలా కట్టుదిట్టంగా ఉంచుతాడనీ, నిరంకుశంగా ప్రవర్తిస్తాడనీ. కాని ఇంట్లో మాత్రం మెత్తగా ఏమీ పట్టించుకోకుండా ఉంటాడనీ ఆవిడే చిరునవ్వుతో చెప్పింది. ఆయన ఒక పద్ధతి ప్రకారం ఉండాలని కోరుతుందావిడ. ఆయన్ని తన పద్ధతిలో బలవంతంగా ఉంచాలని చూస్తోంది - ఎంతో సరళంగానే అయినా. ఆయన ఆవిడ అందుబాటులోకి రావటం లేదు. ఆవిడకి తను ఆధారపడటానికీ, తన ప్రేమ కురిపించటానికీ ఎవరూ లేరు.

యథార్థం కన్న మనకి ఊహే ఎక్కువ ముఖ్యం. ఎలా ఉండాలో అనే ఊహకి ఉన్నంత విలువ వాస్తవంగా ఉన్నదానికి ఉండదు. ప్రస్తుతం కన్న ఎప్పుడూ భవిష్యత్తే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. ఊఃహారూపం, సంకేతం వాస్తవమైన దాని కన్న గొప్పగా ఉంటాయి. వాస్తవమైన దాన్ని ఊహారూపంలో గాని, ఒక నమూనాతో గాని, కప్పిపెట్టి ఉంచుతాం. ఆ విధంగా ఉన్నదానికీ, ఉండాలనుకున్నదానికీ వైరుధ్యాన్ని సృష్టిస్తాం. ఉండాలనుకున్నది ఊహ మాత్రమే, కల్పితమైనది మాత్రమే. అందుచేత వాస్తవమైన దానికీ, భ్రమకీ మధ్య సంఘర్షణ - కేవలం వాటి మధ్య కాదు, మన లోపలే. మనకి వాస్తవికత కన్న భ్రమే ఇష్టం. ఊహ ఎక్కువ ఆకర్షణీయం గానూ, తృప్తికరంగానూ ఉంటుంది. అందుకే దాన్ని గట్టిగా పట్టుకువదలం. ఈ భ్రమే నిజమై, వాస్తవమైనది అబద్ధమైపోతుంది. ఈ నిజం అనుకునే దానికీ, వాస్తవమైన దానికీ మధ్య జరిగే సంఘర్షణలో చిక్కుకుంటాం మనం.

ప్రయత్న పూర్వకంగానో, అనాలోచితంగానో మనం ఎందుకు ఊహని పట్టుకుని వదలకుండా వాస్తవమైనదాన్ని అవతలికి తోసేస్తాం? ఊహగాని, నమూనాగాని స్వయంకల్పితమే. అదొక రకమైన స్వీయ ఆరాధన - ఆత్మని శాశ్వతం చేసుకోవటం. అందువల్లనే అది తృప్తికరంగా ఉంటుంది. అధికారం చెలాయించటానికీ, గట్టిగా పట్టుపట్టటానికీ, మార్గదర్శకత్వం వహించటానికీ, తీర్చిదిద్దటానికీ ఊహ శక్తినిస్తుంది. ఊహ స్వయంకల్పితం కావటం చేత తన్ను