పుట:Mana-Jeevithalu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

శక్తిమంతం చేసుకోవటమే. సొంతం చేసుకున్నది ఎటువంటి స్థాయికి చెందినదైనా, అది ఆత్మకి శక్తి, సంపద, చురుకుతనం కలిగినట్లు భావన కలుగచేస్తుంది. ఈ అనుభూతినే సాఫల్యం అంటారు. అన్ని అనుభూతుల లాగే అది కూడా త్వరలోనే రూపుమాసి, దాని స్థానంలో మరొకదాన్ని తేవటం, ప్రత్యామ్నాయంగా ఉంచటం - ఈ విధమైన ప్రక్రియ మన కందరికీ తెలిసినదే. ఈ రకం క్రీడతోనే మనలో చాలా మంది తృప్తిపడుతున్నారు. అయితే, కొంతమందికి ఇంకా శాశ్వతమైన సంతృప్తి కావాలి. తమ జీవితాంతం పొంద గలిగే సంతృప్తి కావాలి. అటువంటిది దొరికినట్లయితే, ఇకవారికి ఏవిధమైన ఇబ్బందీ కలుగకూడదని ఆశిస్తారు. కాని, ఇబ్బంది కలుగుతుందేమోనన్న అవ్యక్త భయం నిత్యం ఉంటుంది. దాన్ని ప్రతిఘటించటం సూక్ష్మరూపాలలో అలవరచుకుని, వాటిల్లో రక్షణ పొందుతుంది మనస్సు. అందుచేత మరణభయం అనివార్యమవుతుంది. సాఫల్యం, మరణభయం - ఈ రెండూ ఆత్మని శక్తి సంపన్నం చేసుకునే ఏక ప్రక్రియకి రెండు వైపులు. సాఫల్యం అంటే దేనితోనో ఒకదాంతో - పిల్లలతో గాని, ఆస్తితోగాని, భావాలతో గాని తన్నుతాను ఐక్యం చేసుకోవటమే కదా. పిల్లలు, ఆస్తి కొంతవరకు ప్రమాదకరం. కాని భావాలు ఎక్కువ క్షేమాన్నీ రక్షణనీ ప్రసాదిస్తాయి. మాటలు, అంటే భావాలూ, జ్ఞాపకాలూ - వీటికి సంబంధించిన అనుభూతులు - ఇవి చాలా ముఖ్యం అవుతాయి. సాఫల్యం, సంపూర్ణత కేవలం మాటలుగా మాత్రమే మిగులుతాయి.

ఆత్మసాఫల్యం అనేది లేదు. ఆత్మని శాశ్వతం చేసుకోవటం మాత్రమే. నిరంతరం అధికమయే ఆత్మ సంఘర్షణలతో, వైరుధ్యాలతో, దుఃఖాలతో, అనంతమైన సంతృప్తిని ఏదో ఒక స్థాయిలో కోరుకోవటం ద్వారా గందరగోళాన్నీ దుఃఖాన్నీ కొనితెచ్చుకోవటమే అవుతుంది. సంతృప్తి అనేది ఎప్పటికి శాశ్వతంగా ఉండటం సాధ్యంకాదు. సంతృప్తి కలిగించిన అనుభవాన్నొక దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుఇకోవచ్చు. కాని, ఆ అనుభవం గతించి పోయింది. దాని స్మృతి మాత్రమే మిగిలింది. ఈ స్మృతికి జీవం ఉండదు. కాని, ప్రస్తుతానికి తగిన ప్రక్రియ లేకుండా చేసి, దానికి మీరు జీవం పోస్తున్నారు. గతించిన దానిపై మీరు జీవిస్తున్నారు. మనలో, అనేకమంది చేసేది అదే. ఆత్మ అవలంబించే మార్గాలను తెలుసుకోకపోవటం భ్రమకి దారితీస్తుంది. ఒక్కసారి