పుట:Mana-Jeevithalu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఏదో సాధించాలి, ఏదో లాభం పొందాలి అనే కోరిక చిత్తశుద్ధికి పునాది. ఈ బలవత్తరమైన కోరిక పైపైదైనా, లోలోపలిదైనా, దానికి అనుగుణంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. దానితోనే భయం ఆరంభమవుతుంది. భయం ఆత్మజ్ఞానాన్ని అనుభవం వరకే పరిమితం చేస్తుంది. అందుచేత, అనుభవించిన దానికి అతీతంగా ఉండటం సాధ్యం కాదు. పరిమితమైనది కాబట్టి, ఆత్మజ్ఞానం విస్తృతమైన, గాఢమైన ఆత్మచైతన్యావస్థను మాత్రమే అలవరచు కుంటుంది. అనేక స్థాయిల్లో, అనేక సమయాల్లో "నేను" అనేది అంత కంతకు విస్తృతమవుతుంది. అంచేత, సంఘర్షణ, బాధా కొనసాగుతూనే ఉంటాయి. ఏదో కార్యకలాపంలో పడి మిమ్మల్ని మీరు ప్రయత్నపూర్వకంగా మరిచి పోవచ్చు - తోట పెంచటంలోనో, ఒక సిద్ధాంతాన్ని అవలంబించటంలోనో, ప్రజలందరిలోనూ యుద్ధం చెయ్యాలనే తీవ్రమైన ఉత్సాహం ప్రకోపించేటట్లు ఉద్రిక్తపరచవచ్చు. కానీ, దాంతో మీరే దేశం, మీరే సిద్ధాంతం, మీరే కార్యకలాపం, మీరే భగవంతుడూ అవుతారు. తాదాత్మ్యత ఎక్కువైన కొద్దీ సంఘర్షణనీ, బాధనీ మరింత కప్పిపుచ్చటం జరుగుతుంది. దేనితోనో ఒకదానితో ఐక్యం చేసుకోవాలనే అంతులేని పోరాటం సాగుతుంది. ఎంచుకున్న ఒకదానితో ఒకటై పోవాలని కోరిక చిత్తశుద్ధిలో సంఘర్షణకి దారి తీస్తుంది. దాంతో నిరాడంబరత పూర్తిగా పోతుంది. ముఖాన విభూతి పూసుకోవచ్చు, సామాన్యమైన వస్త్రం కట్టుకోవచ్చు, బిచ్చగానిలా తిరగవచ్చు. కాని అది నిరాడంబరత కాదు.

నిరాడంబరత, చిత్తశుద్ధి ఎన్నటికీ ఒకచోట సఖ్యంగా ఉండలేవు. ఏదో ఒకదానితో, ఏ స్థాయిలోనైనా సరే, తన్నుతాను ఐక్యం చేసుకున్నవాడు ఎంత చిత్తశుద్ధి కలవాడైనా నిరాడంబరుడు కాడు. ఏదో అవాలనే ఇచ్ఛే నిరాడంబరతకి వ్యతిరేకం. ఇంకా పోగుచెయ్యాలనే ఆకాంక్ష ఇంకా సాధించాలనే వాంఛ లేకుండా స్వేచ్ఛగా ఉన్నప్పుడే నిరాడంబరత్వం వస్తుంది. సాధించిన దానితో ఐక్యం అయిపోవటం - ఆ ఐక్యం అయిపోవటమే ఇచ్ఛ. అప్రమత్తంగా, ఉదాసీనంగా తెలుసుకోవటమే నిరాడంబరత. ఆవిధంగా తెలుసుకోవటంలో అనుభవించేవాడు అనుభవాన్ని పదిలపరచటం జరగదు. స్వయం విశ్లేషణ ఈ విధంగా అవ్యక్తంగా తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. విశ్లేషించటంలో