పుట:Mana-Jeevithalu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్తశుద్ధి

95

లేకుండా ఏ సద్గుణమూ ఉండదన్నాడు. చెడుని నిర్మూలించాలంటే ఇచ్ఛ ఉండటం అవసరం. మంచికీ చెడుకీ మధ్య యుద్ధం అనంతమైనది, ఇచ్ఛ ఒక్కటే చెడుని అదుపులో పెట్టగలిగేది. ఆయనలో కొంత సరళ స్వభావం కూడా ఉంది. ఎందుకంటే, తోటకేసీ, హాయిగొల్పే పువ్వులకేసీ చూసినప్పుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. కాని, ఆయన తన ఇచ్ఛ, దాని కార్యరూపం - వీటి నుంచి మనస్సుని మరో చోటికి పోనివ్వటం లేదు. ఆయన పరుషపదాల్ని వాడకుండా ఉండటానికి ప్రయాసపడుతున్నప్పటికీ, ఏ మాత్రం కోపం, అసహనం కలిగినా, ఆయన ఇచ్ఛ ఆయన్ని ఉద్రిక్తుణ్ణి చేస్తోంది. ఆయన లక్ష్య పరిధిలో అందానికి స్థానం ఉన్నట్లయితే దాన్ని స్వీకరిస్తాడు. కాని, ఇంద్రియ సుఖానుభూతి కలుగుతుందేమోనన్న భయం మెదలుతూనే ఉంటుంది. ఆయన బాగా చదువుకున్నవాడు. సభ్యత తెలిసినవాడు. ఆయన ఇచ్ఛ ఆయన్ని వెన్నంటే ఉంది.

చిత్తశుద్ధి నిరాడంబరంగా ఉండలేదు. చిత్తశుద్ధి ఇచ్ఛను పెంపొందించేందుకు మూలాధారం. స్వార్థం ఎన్ని విధాలుగా ఉంటుందో ఇచ్ఛ తెలుసుకోలేదు. ఆత్మజ్ఞానం ఇచ్ఛానుసారం కలిగేది కాదు. క్షణక్షణం జీవితంలో ప్రతి సంచలనానికీ కలిగే ప్రతిక్రియలను తెలుసుకోవటం ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది. వాటంతట అవే కలిగే ప్రతిక్రియలను ఇచ్ఛ ఆటంకపరుస్తుంది. అసలా ప్రతిక్రియల వల్లనే ఆత్మయొక్క రూపనిర్నాణం ఆవిష్కారమవుతుంది. కోరిక యొక్క సారమే ఇచ్ఛ. కోరికను అర్థం చేసుకోవటానికి ఇచ్ఛ ప్రతిబంధక మవుతుంది. ఇచ్ఛ ఏ రూపంలో ఉన్నా - మనస్సు పైపైన ఉన్నది గాని, లోలోపలికి వేళ్లు పాతుకుపోయిన కోరికలు గాని, ఉదాసీనంగా ఉండలేవు. ఉదాసీనతలోనే, అప్రమత్తమైన నిశ్శబ్దంలోనే, సత్యమనేది ఉంటుంది. సంఘర్షణ ఎప్పుడూ కోరికల మధ్యనే. ఆ కోరికలు ఏస్థాయిలో ఉన్నవైనా సరే. ఒక కోరికని బలపరుస్తూ, దానికి వ్యతిరేకంగా ఉండే తక్కిన వాటిని అణచివేసి నట్లయితే, మరింత ప్రతిఘటన ఏర్పడుతుంది. ఈ ప్రతిఘటనే ఇచ్ఛ. ప్రతిఘటన ద్వారా అవగాహన కలగదు. ముఖ్యమైన దేమిటంటే, కోరికను అర్థం చేసుకోవటం. అంతేకాని, ఒక కోరికను మరోకోరిక ద్వారా తప్పించు కోవటం కాదు.