Jump to content

పుట:MaharshulaCharitraluVol6.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

మృగశృంగ మహర్షి

(వత్సమహర్షి)

వత్సుని జననము

తొల్లి కృతయుగమున రథంతరకల్పమందు కుత్సుఁడను విప్రోత్తముఁడు విరాజిలుచుండెను. వేదశాస్త్రాదివిద్యల నేర్చి యాతఁడు కాలక్రమమున కర్దమప్రజాపతికన్యకలలో నొకతెను ధర్మపత్నిగాఁ బరిగ్రహించి గార్హస్థ్యధర్మముల నద్వితీయముగా నడపించుచుండెను. ఇట్లుండ నా మహనీయుని దయవలన గర్భము ధరించి యాతనిపత్ని నవమాసములు నిండినంత నొకసుపుత్రుని గాంచెను. ఆతనికి వత్సుఁ డను పేరిడి తల్లిదండ్రులు పెంచిరి. ఆతఁడు యుక్తవయస్సు గన్నంతనే ఉపనయన మొనరించి కుత్సుఁడు బ్రహ్మచర్యాశ్రమమును నడప నాతని నియోగించెను.

వత్సుని తపశ్చర్య

వత్సుఁడు బ్రహ్మచర్యాశ్రమధర్మముల నతిశ్రద్ధాభక్తుల నిర్వహించుచు దైవికముగా నొకనాఁడు కావేరీతీరమునకు వచ్చెను. సముద్రముఁ జేరునదులలో ఊదగ్వాహినులు పశ్చిమవాహినులు ప్రశస్తములనియు, అవి పవిత్రముచేయు భూభాగములు నివాసయోగ్యములనియు నెఱింగినకారణమున, పశ్చిమముఖముగాఁ బ్రవహించుకావేరీ పవిత్రతీరమున నాతఁడు నివసింపఁ దొడఁగెను. అతఁ డట నుండి శాస్త్రవిధుల ననుసరించి స్నానజప తపోధ్యానపరాయణుఁడై మూఁడు మాసము లుండి తత్త్వజ్ఞానసంపన్నుఁ డై నంత మమత్వమును విడనాడి బయలుదేఱి పోయి సహ్యజానది కుత్తరభాగమునఁ గలనారాయణాద్రియందు నివాస మేర్పఱుచుకొని తపశ్చర్యకుఁ గడంగెను.