పుట:MaharshulaCharitraluVol6.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మృగశృంగమహర్షి

75


వత్సునకు మృగశృంగుఁ డను పేరు కలిగినవిధము

నారాయణాద్రికి సమీపమునఁ గల్యాణతీర్థ మనుపవిత్ర తీర్థముండెను. ఆ తీర్థమునఁ బ్రతిదినము స్నానము చేసి యాతఁ డుగ్ర తపమునకుఁ గూర్చుండి ఆత్మజ్ఞానసంపన్నుఁడై యానందమున సర్వము మఱచి సమాధి నిమాలితాక్షుఁడై యుండెను. ఇట్లు కొంతకాల మగుసరి కాతనికి దేహస్మృతియే పోయెను. ఆతనిశరీర మెండుకట్టెవలె నిలిచియుండెను. ఆ ప్రాంతమున విహరించు లేళ్ళు ఆ తీర్థమునందలి నీళ్ళు త్రాగి తమశృంగములచే మోడువలె నున్న ఋషిశరీరమును ఱాయుచుండెడివి. ఆ మహనీయున కిది తెలియనే తెలియదు. ఇట్లనుదినము మృగశృంగముల ఱాపుడువడుచున్నను తెలియనిస్థితిలో నాతఁడు పెక్కేండ్లుండెను. సమీపమునఁ గల ఋషు లీచిత్రముఁ జూచి యాతనికి మృగశృంగుఁ డనుపే రిడిరి.

వత్సునకు విష్ణువు ప్రత్యక్ష మగుట

ఇ ట్లనేకవత్సరములు గడచినపిదప వత్సునితపమునకు మెచ్చి విష్ణుమూర్తి వచ్చి యాతనిసహస్రార మంటఁగనే వత్సుఁడు కమ్నలు తెఱిచి యెదుటఁ బ్రత్యక్షమైననారాయణునికి భయభక్తి శ్రద్ధావినయవిధేయతలతో సాష్టాంగనమస్కార మొనరించి, ఆనందవిశేషమున నొడలంతయు గగుర్పొడువ ఆనందబాష్పములు జలజల రాలఁ గడుభక్తి తో నాతని నిట్లు స్తుతించెను. "దేవాదిదేవా ! ధర్మసంస్థాపనార్థము నీవు భూమి నవతరించుచుందువు. విశ్వసృష్టిస్థితిలయములు నీచేతిలోనివి. ఒక్కఁడ వయ్యుఁ బెక్కు రూపమఃలఁ జెలువారు చిత్స్వరూపుఁడవు. నీవు అణువుకంటె నణువవు; మహత్తుకంటె మహత్తువు. అమేయుఁడవు. నిర్వికారుఁడవు. నిర్గుణుఁడవు. నిన్ను నేను శరణుజొచ్చెదను. నన్ను నీవు కాపాడుము."

హరి కరుణించి యాతనితో నిట్లనెను: వత్సా ! నీ భక్తికి మెచ్చితిని. నీ తపశ్శక్తికి దర్శన మొసంగితిని. నీవు భవిష్యజ్జన్మమున ఋభు వనుమహర్షివై జన్మించెదవు. అది నీకుఁ గడపటిజన్న. నేఁటివఱకు నీవు