పుట:MaharshulaCharitraluVol6.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంకణమహర్షి

71


ప్రధానజీవనుఁడగు నీ కీనృత్య మేల? నీ వింతహర్షభరితుఁడ వగుటకుఁ గారణమేమి”? యని యడిగెను. " మహాత్మా! నాచేతినుండి శాక రసము స్రవించినది. అదియే నానృత్యమునకుఁ గారణ" మని మంకణుఁడు బదులు చెప్పెను. వెంటనే మహేశ్వరుఁడు " ఇది యెంతటి విశేషము? తపము లిట్టివే? చాలు నర్తనము మాను" మని యా ముని యంగుష్ఠమును తన వ్రేలితో గీఱెను, ఆ గాయమునుండి మంచును మించిన బూడిద కాఱెను. తత్త్క్షణము మంకణుఁడు మహేశ్వరుని పాదములపై వ్రాలి తనతపోగర్వ మణఁగిన దనియుఁ దన్ను క్షమించి తనకుఁ దపః పతనము కలుగకుండఁ జేయు మని

“దైవమెల్లఁ దలఁప నీవ సమస్తజ
          గంబులకును నేడుగడయు నీవ
 కర్మఫలదుఁడవును గర్మ ప్రదుండవు
          నీవ కరుణ నన్నుఁగావు మభవ ! "
                          భార. శల్య. 2 ఆ. 162

అని మఱిమఱి ప్రార్థించెను.

అంత శివుఁడు ప్రసన్నుఁడై మంకణుని తపఃప్రభావ మక్షిణ మగునట్లు తాను సప్తసారస్వతమున నిలిచి దానిని సేవించువారి కిహపరము లిచ్చెదనని వరమిచ్చి చనెను. అంతట మంకణ మహర్షి నృత్యము మానెను. ఆతనితో స్థావరజంగమ ప్రకృతి యంతయు నృత్యము మానెను. జగముల సంక్షోభము శాంతించెను. *[1]

మంకణుని కుమారునికథ

మంకణమహర్షి పరమగుణో త్తరుఁడయి కాలక్రమమున నొక కన్యం బెండ్లాడి గృహస్థధర్మముల ననుపమానముగా జరిపి యొక

  1. *భారతము. పద్మపురాణము ఆదిఖండము.