పుట:MaharshulaCharitraluVol6.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

మహర్షుల చరిత్రలు

బృహస్పతి అయోనిజ యగుతార యను సౌందర్యవతిని వివాహమై యామెతో గార్హస్థ్యసౌఖ్యము అనుభవించుచు నుండెను. కొంత కాలమునకు శశాంకుఁడు వచ్చి బృహస్పతికి శిష్యుఁడై తారాబృహస్పతుల కత్యంత ప్రేమపాత్రుఁ డయ్యెను. బృహస్పతి యేకసంధాగ్రాహి యగునాతనికి సమస్తశాస్త్రములు నేర్పుచుఁ బ్రాణసమముగాఁ జూచు చుండెను. ఇట్లుండ నింద్రుఁడు చేయు యాగమున కేగుచు బృహస్పతి తారాశశాంకుల నింటికడ విడిచి చనెను. పరస్పర కామోపహతు లగు న య్యిరువురకు యథేచ్చా వ్యభిచారమునకుఁ దగిన యదను లభించెను. మహాపతివ్రత యయ్యుఁ దార భర్తకుఁ దగిలినశాపము కారణముగా సుతసముఁ డగు శశాంకునిం గూడి యాతనివలన గర్భము ధరించెను. బృహస్పతి తిరిగివచ్చి జరిగిన సంగతి గ్రహించి యిరువురినిఁ జీవాటులుపెట్టి శశాంకుని బంపివేసెను. తరువాత నాతఁడువచ్చి యేకాంతముగ నున్నపుడు తారను దీసికొనిపోయెను. తార బుధుఁ డను కుమారునిం గనెను. బృహస్పతి తన భార్యను దన కిప్పింపు డని ఇంద్రాదులతోడను బ్రహ్మాదులతోడను మొఱవెట్టుకొనవలసివచ్చెను. చంద్రుఁడు తార నిచ్చుట కంగీకరింపని కారణమున నిరుపక్షముల వారికి ఘోర మగుపోరు సంభవించెను. అపుడు బ్రహ్మ వచ్చి శశాంకు నొప్పించి అయోనిజ కావున అపవిత్ర కాని తారను తిరిగి బృహస్పతి కిప్పించి యిరుపక్షములవారికి సఖ్యము నెఱపెను.

బృహస్పతికిఁ దారవలన సుతుఁడు కలుగుట

ఈ ప్రకారము పరహస్తగతయైన తార తిరిగి బృహస్పతిహస్తమునఁ బడెను. శాపతిమిరము వై తొలఁగినకారణమున నామె మహాపతివ్రతయై యిఁకఁ దప్పుదారులు తొక్కక బృహస్పతినే సేవించుచుండెను. అసమానలావణ్యవతి యగునామెకు బృహస్పతి దయవలన గర్భము నిలిచెను. కాలక్రమమున నామెకు కచుఁ డను కుమారుఁ డుద్బ వించెను.