పుట:MaharshulaCharitraluVol6.djvu/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృహస్పతిమహర్షి

61


యధర్మముగ మాతృసమానం గూడి శాపపాపహతుఁ డగుఁగాక యని శుక్రాచార్యుఁడు శపించెను. ఈ శాపము కారణముగా బృహస్పతి సర్వ విద్వద్వరేణ్యుఁ డయ్యు, సర్వధర్మవిదుఁడయ్యు సర్వము మఱచిన వాఁడై తిరుగుచుండెను. భూతము సోఁకిన మానవునివలె, సురాపానమున మదమెక్కిన త్రాగుఁబోతువలె బృహస్పతి వివేకవిహీనుఁడయ్యెను. ఆహా ! సత్పురుష శాప మెంతవాని నెంత హీనుఁ జేయును !

ఇట్లుండఁగా నొకనాఁడు బృహస్పతి యన్నయగు ఉదథ్యునాశ్రమమున కేగెను. అట, ఉతథ్యుఁడు తీర్థయాత్రల కేగియున్న కారణమున నాతనిధర్మపత్నియు, అసమానలావణ్యవతియు, విశేషించి గర్భవతియు నైన మమతాదేవిని గాంచెను. శాపోపహతుఁ డగునా సుర గురునకుఁ గామమోహము కలిగెను. ఏకాకినియై యున్న యా సాధ్వి మఱఁది కతిథిపూజ చేసి యాదరించెను. అంత బృహస్పతి మదనా తురుఁడై యామె కరముఁ బట్టి రతిసుఖ మిమ్మని బలవంత పెట్టెను. ఆమె నిశ్చేష్టయై తాను గర్భిణియై యున్నసంగతియు మాతృసమాన యైన సంగతియు నాతనికి గుర్తునకుఁ దెచ్చెను. ఐనను, శుక్రతాప తిమిర బద్దుఁ డగు దేవగురున కది యసమంజసముగఁ దోఁపలేదు. అందుచే నాతఁ డామెను బలవంతమున శయ్యకుఁ దార్బి రమించి కామోపశమనముఁ గావించుకొనెను. తత్పతిత వీర్యమును మమతాగర్భస్థుఁ డగు శిశువు వెలికిఁ దన్ని వేసెను. అమోఘ మగుబృహస్పతి వీర్యము నేలపైఁ బడి తదనంతశక్తివలన వెనువెంటనే బాలుఁ డయ్యెను. ఈ బాలుని మమతాబృహస్పతు లిరువురును విడిచి వేయఁగా భరతుఁ డనురాజు తీసికొనిపోయి పెంచేను. ఈతఁడే భరద్వాజుఁ డయ్యెను.

బృహస్పతికి ఉతథ్యుని శాపము

తీర్థయాత్రలనుండి తిరిగివచ్చిన ఉతథ్యునకు భార్యయగు మమత జరిగిన సంగతి యంతయుఁ దెలిపెను. ఆతఁ డాశ్చర్యపడి సోదరుని చేష్ట కసహ్యించుకొని బృహస్పతిభార్య నొరుఁడు రమించునట్లును, బృహస్పతి యవమానదందహ్యమానమానసుఁ డగునట్లును శపించెను.