పుట:MaharshulaCharitraluVol6.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

మహర్షుల చరిత్రలు


నిజమాతృధర్మము నామె యెంత యద్భుతముగా నిర్వహించినది! “తల్లి హరిఁజేరు మని యెడి తల్లి తల్లి కదా ! " మిగిలినతల్లులో. పిల్లులు, బల్లులు, నల్లులు !

ఆ తల్లిమాటల కుల్లములు పల్లవింప, ఉత్సాహము నూఁతగాఁగొని ఉపమన్యు ధౌమ్యు లుభయులు పరమేశ్వరునిగుఱించి యుగ్రతప మొనరింపఁ దొడంగిరి. నిష్టాగరిష్ఠులై వారు కొన్నేండ్లు వామ పాదాం గుష్ఠములపై నిలిచియు, కొన్నేండ్లు ఫలాహారులై యుండియు, కొన్నేండ్లు జీర్ణపర్ణాహారులై యుండియు, మఱికొన్నేండ్లు జలపాన మాత్రులై యుండియు. నిఁకఁ గొన్నేండ్లు వాయుభక్షులై యుండియు మహాతప మొనరించిరి.

పిదప నొకనాఁడు వీరినిష్ఠఁ బరీక్షించుటకై మహేశ్వరుఁ డింద్ర రూపమున వీరికడ కేతెంచి ‘‘మీ తపమునకు మెచ్చితిని. నే నింద్రుఁడను. ఏమికోరిన నది యిచ్చెదను. కోరుకొం” డని పలికెను. ఉప మన్యుఁ డా మాటలువిని “అయ్యా! నీ దారిని నీ వేఁగుము. నిన్ను గుఱించి మేము తపము చేయలేదు. నీ దర్శనము మా కక్కఱలేదు. నీ వరములు మా కంతకంటె నక్కఱలేదు. సర్వలోకేశ్వరుఁడై న శర్వుని గుఱించి మేము తప మొనరించితిమి. మా కోరికలఁ దీరుప నాతఁడే నేరుపరి. మమ్ముఁ గాపాడినను. ఱాపాడినను, రక్షించినను, శిక్షించినను ఆతఁడే మాకుఁ గావలయును. ఆతని దాసత్వముతక్క మా కింద్రత్వము వలదు. బ్రహ్మత్వము వలదు” అని పెక్కువిధములఁ దమ యనన్య భక్తిభావమును వెల్లడించెను.

ఇంద్రుఁ డిఁక నేమి చెప్పిన నేమి యడిగిన నాలింపక యుప మన్యువు నిరర్గళపరమేశ్వరభక్తి ప్రసంగ పారవశ్యమున సమాధిస్థితి నందెను. అపు డింద్రుఁ డంతర్హితుఁ డయ్యెను. ఆతని వెనుక నింద్రుని యైరావతము హంసకుందేందు సమానమగు ధావళ్యముతో రజత మృణాళ కాంతులు రమ్యముగ వెలుంగ ప్రత్యక్షమైన క్షీరసాగరమో యన్నట్లు మనోహర సర్వాంగములతోఁ గానవచ్చెను. ఆ సోదరు లిరువు రై రావతమును దిలకించుచుండఁగానది యైరావతము కాక హిమవత్పర్వత