పుట:MaharshulaCharitraluVol6.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధౌమ్యమహర్షి

37


యింటికిఁ దిరిగి వచ్చిన తరువాతఁ దల్లిని జేరి "అమ్మా! మన బంధువు లింట క్షీరాన్నము పెట్టిరే. అది అమృతమువలె నున్నదే. నీవు పెట్టిన క్షీరాన్నము చప్పగ డోకు వచ్చినది. నీవు పెట్టినది క్షీరాన్నము కాదే ! " యని పలికిరి. బిడ్డలతొక్కుఁ బల్కులకుఁ దల్లి సంతోషించి కౌఁగిలించుకొని ముద్దు పెట్టుకొని “ బిడ్డలారా ! నిజమే. ఆవును కొనుటకు మనము ధనవంతులము కాము. దానము పట్టుటకు మీ తండ్రి యంగికరింపరు. ఆవు లేనిదే పాలు రావుకదా; పాలు లేనిదే క్షీరాన్న మెట్లుచేసి పెట్టఁగలను? ఈ సంగతి చెప్పినచో మీరు బాధపడుదురని మీకు మెత్తని పిండి నీళ్ళలోఁ గలిపి పెట్టితిని ” అని బదులు చెప్పెమ.

తల్లి మాటలు విని పిల్లలు “అమ్మా! మాకు క్షీరాన్నము కావలెనే ! అది మా కెట్లు లభించునో ఉపాయము చెప్పుము. అట్లుచేసి మేము సంపాదించి నీకును బెట్టుదు” మని పలికిరి. వారి మాటలకు సంతోషించి యా సాధ్వి “ వత్సలారా ! ఆకలములు, కాయకూరలు తినుచు, నదీజలములు త్రాగుచు, పర్వతారణ్యతీర్థ ప్రదేశములఁ గాఁవురముండు మనవంటి తపోజపపరాయణులకుఁ బరమశివుఁడే పరమగతి. మన కేది కావలసినను, ఇహమైనను బరమైనను, చిన్న కోరిక యైనను, బెద్ద కోరికయైనను ఆ మహా దేవునే మనము ప్రార్థింపవలయును. ఆతని దయకలిగినదా మనకు క్షీరాన్న మే యేల, ఇహపరముల నెప్పు డేది కోరిన నది సిద్ధించును. ఏ కోరికలు లేని మీ తండ్రి యా పరమేశ్వరుని పాదపద్మములను మదిఁబట్టి నిర్వికల్పసమాధిలో నిర్మలానంద మనుభవించుచు నిలిచియున్నారు. మీకుఁ గోరిక లున్న చోఁ గోరికలఁ దీరుపఁ గల శివునే భజింపుఁ" డని యా బాలుర కుపదేశించెను.

ఆ పుణ్య సాధ్వీగర్భశుక్తిముక్తాఫలములగు నా బాలురంత “అమ్మా! తప్పక మే మట్లు చేసెదము. కాని, ఆ పరమ శివుఁ డెట్లుండును? ఎచ్చట నుండును? ఏమి చేసిన మాకుఁ బ్రసన్నుఁడగును? తెలుపు" మని ప్రార్థించిరి. పరమేశ్వర పాదారవిందభజనోత్సేకము వారికి రేకెత్తించిన యాతల్లి వారికి ఈశ్వర రహస్యోదారవిజ్ఞాన మంతయు పూసగ్రుచ్చినట్లు, అరటిపండొలిచి చేతఁ బెట్టినట్లు సమగ్రముగ స్పష్టముగ నుపదేశించెను. ఆహా! ఆ సాధ్వి మాట లెంత పాటవములు!