పుట:MaharshulaCharitraluVol6.djvu/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

మహర్షుల చరిత్రలు


మనియు పార్వతి యాతనిపైఁ గోపించెను. అది గ్రహించి జై గీషవ్యుఁ డటనుండి వెడలిపోయెను. అపుడు శివుఁడు పార్వతిని జూచి "దేవి! అతఁడు జై గీషవ్యుఁడు. మహాయోగి. మహా జ్ఞాని. మనపరమభక్తుఁడు. పరమ ప్రశాంత చిత్తుఁడు. ఆతని నట్లు కోపించితివి. ఆతఁడు నా భక్తుఁడు. సఖుఁడు, శిష్యుఁడును" అని పలికెను. అందులకు పార్వతి “దేవా! నీ నా సంభాషణమున నాతఁ డడ్డువచ్చి సమాధాన మిచ్చుట న న్న వమానించుట కాదా? మనల నాశ్రయించి వరములు గ్రహింప వచ్చిన యాతఁడు మనతో సమానస్థాయిని మాటాడి దోషయుక్తుఁడై నాఁ" డని పలికెను. దానిపై శివుఁడు "దేవీ! కాదు. కాదు. ఆతని కే వరము నక్కఱలేదు. ఆతఁ డట్టి వాశించి మనకడకు రాలేదు. ఆతఁడు ద్వంద్వాతీతుఁడు, సమ లోష్టాశ్మ కాంచనుఁడు, నిరాశి. ఆతని కింద్రత్వము, బ్రహ్మత్వము, రుద్రత్వము తృణప్రాయములు. ఆతఁడు బ్రహ్మజ్ఞాని. ఆతని నీ వట్లు తృణీకరింపరా" దనెను. అందులకుఁ బార్వతి “ఐనచో నాతని ఆశా రాహిత్యమును బరీక్షింప నా కనుజ్ఞ యి” మ్మని పరమేశ్వరునిం గోరెను. ఆతఁడంగీకరించెను. అపుడు పార్వతీపరమేశ్వరులు వృషభారూఢులై కొంతపరివారము వెంట రాఁగా, పరిశుద్దాత్ముఁడు, ముని శ్రేష్ఠుఁడు నగు జై గీషవ్యుని యాశ్రమమునకు వచ్చి చేరిరి.

ఏ కోరికయు లేక గాలిలేనిచోటఁ బ్రకాశించు దీపమువలె వెలుంగుచు, చింపిబొంతఁ దాల్బి చిద్విలాసము ముఖమునఁ దాండవింప నానంద పరవశత్వమునఁ జిందులుద్రొక్కు జై గీషవ్య యోగీంద్రుని దగ్గఱి పార్వతీపరమేశ్వరులు నిలిచి "యోగీంద్రా ! నీకుఁ గావలసినవర మేదైనఁ గోరుకొమ్ము. ఎట్టి యసాధ్యవరమైన ననుగ్రహింతు” మని పలికిరి. జై గీషవ్యుఁడు వారికి నమస్కరించి శంకరుని జూచి "దేవా! నీ దయ ఈయలేని దేమున్నది ? నేను కృతార్థుఁడను. నాకు వలయున దేమియు లేదు” అని బదులు చెప్పెను. పార్వతీపరమేశ్వరు లాతని రెట్టించి రెట్టించి యడిగి యెన్ని విధములనో యాతనిని మభ్యపెట్టఁ జూచిరి. కాని, యాతఁడు తాను సూదియందలి బెజ్జము ననుసరించి పోవుదారమువలె నీశ్వరేచ్చా ప్రపర్తిత జగమున నిరాశి, విజితేంద్రియుఁడునై గమించువాఁడు గావున, నేమియుఁ గోరుకొన నొల్లఁడాయెను. నిజముగ నాత