Jump to content

పుట:MaharshulaCharitraluVol6.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



మహర్షుల చరిత్రలు

జైగీషవ్య మహర్షి

జై గీషవ్యుఁడు మహాయోగీశ్వరులలో నొకఁడు. ఈతఁడు యోగవిద్యచే సాధింపనివిషయమే లేదు. అణిమాది సిద్ధులేకాక ఆకాశగమనము, అనేక లోక గమనము మున్నగు మహా యోగసిద్ధు లీతనికిఁ గరతలామలకములు. ఈ మహర్షి తల్లి దండ్రుల పవిత్రనామములు కాని చరిత్రలు కాని కానరావు. జిగీషువు అనఁగా జయింపనిచ్చగలవాఁ డని యర్ధము. ఇంద్రియ జయము, యోగవిజయము, నపారముగఁ గన్న వాఁడగుటచే నీతఁడు జై గీషవ్యుఁడను సార్థకనామముఁ గన్న వాఁడయ్యెను. ఈ మహాత్ముఁ డాజన్మ బ్రహ్మచారి. కేవల పరబ్రహ్మ సంభూతులైన మహనీయులకు సంసారపు జంజాటము లేకపోవుటలో నాశ్చర్యములేదు. ఈతఁడు కపిలమహర్షితోడను దేవలమహర్షితోడను గలిసి తఱచు తిరుగుచుండువాఁడు. అంతేకాదు, ఈ యోగీశ్వరుఁడు కైలాసపర్వతమున నున్న పార్వతీ పరమేశ్వరుల సన్నిధానమున మెలఁగుచో వారికిఁ దలలో నాలుకయై తనరారువాఁడు. అవధూత వేషధారుఁడు, మహాయోగి, మహాజ్ఞానియగు నీతఁడు సర్వశక్తిసంపన్నుఁడు.

కపిల జైగీషవ్యులయోగశక్తి

జై గీషవ్యుఁడు కపిలమహర్షికి శిష్యుఁడు, మిత్రుఁడు, సమస్తమును. ఒకనాఁడు వీరిరువురు మహాభక్తుఁడగు అశ్వశిరుఁడను రాజును గటాక్షింప వాని గృహమున కేఁగిరి. యజ్ఞ దీక్షితుఁడై యున్న అశ్వశిరుఁడు వారిని గౌరవించి యతిథి సత్కారము లాచరించి సుఖాసీనులఁ జేసిన పిదప వారికి సాష్టాంగ సమస్కారములొనర్చి "మహానుభావులారా! మీ రాకచే నా గృహము పవిత్రమైనది. నేను ధన్యుఁడనై తిని. నా యజ్ఞము ఫలప్రదమైనది. దయయుంచి విష్ణుమూర్తి సత్వరకటాక్ష సంపాదసకు నే నేమి చేయవలయునో ఆనతిం”డని ప్రార్థించెను. అంత