పుట:MaharshulaCharitraluVol6.djvu/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

మహర్షుల చరిత్రలు


మయ్యెను. ఇది యంతయు శ్రీకృష్ణమాయ యని యుదంకుఁడు తలపోయుచుండఁగాఁ గృష్ణుఁ డచటికి వచ్చెను. "అయ్యా! కృష్ణభగవానుఁడా ! నీ విచ్చిన వరము వ్యర్థమైనది. మాలవాని యొడలి జలము నేను త్రావుదునా ? ఇదియా నీవు నాకుఁ జేసిన మేలు?” అనెను. శ్రీకృష్ణుఁ “డయ్యా! నే నింద్రునిఁ బ్రార్థించి నీ కమృత మిమ్మంటిని. ఆతఁడు దేవా! మానవుల కమృత మేల? మఱియొక టేదైన నిచ్చెద ననెను. అట్లు కా దా మహర్షి కమృతమే యిమ్మని నేనంటిని. “సరే, నేను మాలవాని వేషమున నేఁగి యమృత మీఁ జూచెదను. ఆతఁడు వల దని తిరస్కరించిన నేను బోయెద' నని నాతోఁ జెప్పి నీ కడకు వచ్చెను. నీవు చేతులార నమృతముఁ జెడఁకొట్టుకొంటివి. పోనిమ్ము. నా దయ నీ వమృతుఁడ వై తివి. నీవు జీవించియున్నంతకాల మెప్పుడు తలఁచిన నపు డీమరుభూమిలో మేఘములు చాలినంత వర్షమిచ్చుఁ గాక ! ఆ మేఘములు నీ పేరు 'ఉదంకమేఘము' లనఁ బరఁగును. చిరకాలము నీవు తపోజీవనముఁ గడపి తుదకు మోక్షమందుదు” వని యాశీర్వదించి హరి యదృశ్యుఁ డయ్యెను.

ఉదంకమహర్షి చిరకాల మట్లు జీవించి భక్తి జ్ఞానవైరాగ్య సంపన్నుఁడై మోక్ష మందెను.*[1]


  1. *భారతము ఆశ్వమేధపర్వము.