పుట:MaharshulaCharitraluVol6.djvu/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

మహర్షుల చరిత్రలు


కపిలమహర్షి “రాజా! నే నా విషయము నీకుఁ దెలుపుటకేవచ్చితిని. నన్ను విష్ణుముర్తిగా నెఱిఁగి త్రికరణశుద్ధిగా సేవింపుము. నీకు సర్వ వాంఛలు సిద్ధించు" ననిపలికెను. రా జజ్ఞానియై యీవాక్యములు కపిలుని యహంకార వాక్యము లని తృణీకరించి "అయ్యో! విష్ణుమూర్తిని నే నెఱుఁగుదును. ఆతఁడు శంఖచక్రగదాపాణి, గరుడవాహనుఁడు. అవిలేని నీవు విష్ణుఁడవన్న నేను నమ్ముదునా?" యని పలికెను. వెంటనే యోగశక్తిచే కపిలమహర్షి శంఖచక్రగదాపాణియై విష్ణువై నిలిచెను. జై గీషవ్యుఁడును దనయోగశక్తిచే గరుడుఁడై విష్ణుమూర్తి వాహన మయ్యెను. అశ్వశిరుఁడు నమ్మఁజాలక "అయ్యా! విష్ణుమూర్తి కమలనాభుఁడు. బ్రహ్మ విష్ణు నాభి కమలమందుండి జన్మించెను. నీవు పద్మనాభుఁడవా? నీ నాభి నుండి జన్మించిన బ్రహ్మ యేఁడి?" అని కపిలుని ప్రశ్నించెను. వెంటనే కపిలమహర్షి యోగమహత్త్వమునఁ గమలనాభుఁ డయ్యెను. జై గీషవ్యుఁడును యోగశక్తిచే విష్ణునాభికమలము నుండి జన్మించిన బ్రహ్మయై నిలిచెను. ఐనను నమ్మఁజాలక అశ్వశిరుఁ “డిది యంతయు మోసమే. నీవు విష్ణుమూర్తి వన్న నేను జచ్చినను నమ్మను. పొ"మ్మనెను. వెంటనే కపిలుని యోగశక్తిచే సభాసదు లెల్లరు నంతర్జాను లైరి. యజ్ఞశాల యంతయు భయంకర వన మృగములతో నిండిపోయెను. అశ్వశిరుఁ డెటు చూచినను ఘోరభయానక దృశ్యములే కాననగుచుండెను. మృత్యుదేవి దంష్ట్రలు దీటుచు మీఁదఁ బడుచున్నట్లుండెను. అశ్వశిరుఁడు గజగజవణఁకిపోయి “మహాప్రభూ! రక్షింపుము. రక్షింపుము. నీవే విష్ణుఘూ ర్తివి. నీతోడి జై గీషవ్యుఁడే బ్రహ్మ. మీ యిరువురకు సాష్టాంగ వందనము” లని భూనభోంతరాళము లదరునట్లేడ్చుచుండఁగనే యాదృశ్య మదృశ్య మయ్యెను. సభాసదులు విచ్చేసిరి. యజ్ఞశాల సర్వమంగళసంభారములతో నిండిపోయెను. అశ్వశిరుఁ డా యోగిపుంగవుల పాదములపై వ్రాలెను. వా రాతనికి 'సర్వం విష్ణుమయం జగ' త్తను విషయమును విపులముగ బోధించి యాశీర్వదించి వెడలిరి. నాఁటి నుండి కపిల భగవానునియు, జై గీషవ్యయోగీశ్వరునియు నద్భుత మహిమలు సర్వలోకములందు వ్యాపించెను *[1]

  1. *వరాహ పురాణము