పుట:MaharshulaCharitraluVol6.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదంకమహర్షి

23


డొనరింపఁ గలఁడు. కాన, దయతో నా కనుజ్ఞ ని” మ్మని కోరి బృహదశ్వుఁ డడవికిఁ బోయెను.

తండ్రియాజ్ఞ ననుసరించి యుదంకమహర్షి కోరికఁదీర్ప నభిలషించి కువలాశ్వుఁ డుదంకునిఁ గూడ నిడుకొని ధుంధుని నెదిరించి ప్రచండయుద్ధమున నాతని నోడించెను. కువలాశ్వుఁడు బ్రహ్మాస్త్రముఁ బ్రయోగింప నది ధుంధుని గాల్చి బూడిదచేసి విడిచెను. ఇంద్రాదులు విచ్చేసి ధుంధుమారుఁ డని కువలాశ్వుఁ బ్రశంసించి యుదంకునికి నమస్కరించి వెడలిరి. ఉదంకుఁడు సంతోషించి కువలాశ్వు నాశీర్వదించి నిజాశ్రమమున కేగెను.*[1]

శ్రీకృష్ణుఁడు ఉదంకాశ్రమమునకు వచ్చుట

శ్రీకృష్ణుఁ డొకప్పుడు హస్తినాపురమునుండి ద్వారకానగరమున కేఁగుచు మార్గమధ్యమునఁ గల ఉదంకమహర్షి యాశ్రమమునకు విచ్చేసెను. ఉదంకుఁడు బ్రహ్మానందమున నాతని నెదుర్కొని షోడశోపచారములతో నతిథిసత్కారము లోనరించి యధికభక్తిఁ జూపెను.

ఆ పిమ్మట అన్నియు నెఱిఁగియు నేమియు నెఱుఁగనట్లు ఉదంకుఁడు " కృష్ణా! కౌరవపాండవులకు బంధుభావము నెలకొల్పి రాజు లందఱును సుఖముగా నుండునట్లు చేసితివికదా? కౌరవులన్నను బాండవు లన్నను నీ కేమాత్రము భేదము లేదు. నీవు నిష్పక్షపాతబుద్ధివి " అని యె త్తిపొడిచెను. శ్రీకృష్ణుఁడు నన్నియు నెఱిఁగియు నేమియు నెఱుఁగనివానివలె " ఋషీంద్రా ! నేను కురురాజుతో నెంతయో యుచితముగా మాటాడితిని, బెదరించితిని. నయమునఁ జెప్పితిని. భయమునఁ జెప్పితిని. భీష్మద్రోణులును జెప్పిరి. బలవంతపెట్టిరి. ఐన నాతఁడు సంధి కంగీకరింపఁడయ్యె. అతిలోభులై వంశధర్మము విడిచి యే విధముగను సంధి కంగీకరింవక కౌరవులు పాండవులతోఁ బోరి సపుత్ర మిత్రపరివారముగా స్వర్గమునకుఁ బోయిరి. పాండవు లైదుగురు మాత్రము మిగిలిరి. కాలనియతిం గడవ నెవ్వరికిని శక్యము కాదు గదా" యని పలికెను.

  1. *భారతము ; ఆరణ్యపర్వము,