24
మహర్షుల చరిత్రలు
ఉదంకుఁడు శ్రీకృష్ణుని శపింపఁబూనుట.
ఆ మాటలకుఁ గోపించి యుదంకుఁడు “కృష్ణా! నీవు దొంగవు. నీవు నిజముగఁ దలఁచిన సంధి జరుగకపోయెడిదా! నీవు మిథ్యాచారుఁడవై శక్తి గలిగియు సంధి చేయక కౌరవకులమును సర్వనాశనము చేసితివి. ఈ దోష మంతయు నీదే. ఈ దోషమునకు నిన్ను శపించెదను జూచుకొ"మ్మని హుంకరించెను. "మునీంద్రా ! నీవు నన్ను శపించిన శపింపవచ్చును గాని ముందు నామాటలు వినుము.
సత్త్వరజస్తమోగుణములు నా వశమునఁ బ్రవర్తించును. మరుత్తులు వసువులు మున్నగువా రెల్లరు నా యందే పుట్టిరి. నే నన్నిఁటియందు నుందును. అన్నియు నా యం దుండును. అపర మన్నను . పర మన్నను రెండు తత్త్వములు నేనే. ఓంకారముతోఁ గూడిన వేదములు నేనే. నాలుగు వర్ణములు నేనే. నాలు గాశ్రమములు, వానివాని సర్వకర్మజాలములు, స్వర్గమోక్షములు అన్నియు నా వశము లని యెఱుంగుము. క్రతుపరులు నన్నే సంస్తుతించి ఫలమును పొందుదురు. దోషులు నన్నుఁ గీర్తించి ప్రాయశ్చిత్తములు చేసికొని కృతార్థు లగుదురు. మనోధర్మములకు నేనే కర్తను. బ్రహ్మవిష్ణుమహేశ్వరరూపము ధరించి సృష్టిస్థితిలయములు నేనే యొనరింతును. లోక సంరక్షణార్ధమై అధర్మాత్ములఁ ద్రుంచి ధర్మముల నుద్దరించెదను. ఐనను, అధర్ము లగు కౌరవులను ధర్మాత్ములగు పాండవులతోఁ గలుపుటకు శక్తి వంచనలేక ప్రయత్నించితిని. దివ్యజ్ఞాన సంపన్ను లగువ్యాసాదిమహర్షుల కాసంగతి తెలియును. వారు నన్ను మెచ్చుకొనిరి. దురాత్ము లగుకౌరవులు మహాత్ములగు పాండవుల నెదుర్కొని ధర్మయుద్ధమున నశించిరి. ఇది నేఁ జేసినపని. ఇఁక నన్ను శపించిన శపింపుము. స్తుతించిన స్తుతింపుము అని కృష్ణుఁడుపలికెను.
ఉదంకమహర్షి యాతని పాదములకుఁ బ్రణమిల్లి లేచి " దేవా ! తెచ్చిపెట్టుకొన్న యహంకారమున నీ వేమందువో యని యట్లలుక నటించితిఁ గాని సర్వమును నే నెఱుఁగుదునుగదా! ఆ యీ చనవుబలిమిని చేసిన యపరాధమును క్షమించి దయతో నీ విశ్వరూపము నొక్కసారి