పుట:MaharshulaCharitraluVol6.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

మహర్షుల చరిత్రలు


ఉదంకుఁడు కువలాశ్వు ననుగ్రహించుట

తొల్లి యిక్ష్వాకువంశజుఁ డగు బృహదశ్వుఁ డనుమహారాజు కువలాశ్వుఁ డనుసత్పుత్త్రునిం గాంచెను. సంతానవంతుఁడును, సమర్థుఁడును, సర్వధర్మరతుఁడును నగుకుమారునికిఁ బట్టాభిషేకము చేసి రాజ్యమాతని కొప్పగించి బృహదశ్వుండు వనమునకుఁ బోయి తపస్సు చేసికొన నిశ్చయించుకొనెను. ఆ సమయమున ఉదంకమహర్షి యచటికి విచ్చేసి బృహదశ్వునిచే సత్కృతు లంది యాతని కిట్లు బోధించెను. “రాజా! నీవు ప్రజారక్షణము చేయుటే ధర్మము. అది మాని యడవికిఁ బోవలదు. రాజులకుఁ బ్రజాపరిపాలనము చేయుటకంటె నధికవ్రతము లేదు. ప్రాచీనరాజు లందఱును ధర్మపాలనముననే కీర్తి గాంచిరి. నీ వంటి మహారాజు బాహుబలమున నేల యేలుచుండుటచేతనే నా వంటి మునులు తపముచేసికొనుచు ధర్మకర్మము లాచరించుట సాధ్యమైనది.

మఱియు నొక విచిత్రవిషయముఁ జెప్పెదను. మధుకైటభులని పేరువడ్డ రాక్షసులకుఁ గుమారుఁడై పుట్టిన ధుంధుఁడనువాఁడు బ్రహ్మదేవునిఁ దపమున మెప్పించి వరములు పడసి దేవదానవులకు గంధర్వులకు జయింపరానివాఁడై మదించి యున్నాఁడు. ఆతఁడిపుడు మా యాశ్రమసమీప ప్రదేశమున సముద్రమునందలి యిసుక తిప్పలోఁ బెద్దబిలము గావించుకొని యందుసుఖముగా నిద్రించుచున్నాఁడు. వాఁడు విడిచిన నిశ్వాసపు గాలి సంవత్సరమున కొకమాఱు పైకి వచ్చి పెద్దగాలిదుమారముఁ గల్పించును. దానివేగమున నచ్చటి భూమి, శిలలు, వృక్షములు ఏడు దినములదాఁక కంపించుచునే యుండును. వానిమూలమున మాకును మా యాశ్రమవాసులకును జాల భయముగ నున్నది. నీవు వానిని జంపి మాకును లోకమునకును మేలొనగూర్పుము. ఇంకొకరహస్యము. ఈ దుర్మార్గునిఁ జంపఁదలఁచిన వానికిఁ దాను సంపూర్ణసహాయుఁడ నగుదు నని పరమశివుఁడు నాకుఁ జెప్పియున్నాఁడు. నీవు తక్క ఈ పని యింకొకరు చేయలేరు. కావున, నీ వట్లొనర్చి లోకసంరక్షణ మొనర్పు" మని కోరెను. “ఋషీంద్రా ! నేను అస్త్రసన్న్యాసము చేసి వనమున కేఁగ దృఢనిశ్చయుఁడనైతిని. నన్ను మన్నింపుము. నీవు కోరినపని నా తనయుఁ డగు కువలాశ్వుఁ