పుట:MaharshulaCharitraluVol6.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదంక మహర్షి

13


రా. రా. " యని పలికెను. ఆ మాటల కదలక బెదరక యుదంకుడు " రాజా ! నేను గురుకార్యమున వచ్చితిని. అందుచేత నీవు నన్ను జంప వీలుకాదు. నీకు నా రక్తమాంసములే కావలసినచో నా గురుని కార్యము నెరవేర్చిన పిదప దిరిగి నీ కడకు వచ్చెదను. అపుడు నీవు నా రక్తమాంసములు గైకొనవచ్చు " ననెను. " ఓయీ ! పగలు మూడవ జాము దాటినతరువాత నా భోజనకాల మని దేవతలు నా కాజ్ఞాపించిరి. నీవు సరి యైన యా కాలమున వచ్చితివి కావున, నిన్ను జంపి తినక విడువ " నని రాక్షసరూపమున నున్న రాజు పలికెను. " రాజా ! నా మాట వినుము. నే నసత్య మాడను. నా పనియైన పిదప దిరిగి వచ్చెదను. నీవు కోరికల దీర్చెడి రాజ వని విని నా కోరినకోరిక నీవే తీర్పగల వని నేను వెదకి వెదకి నిన్ను గన గంటిని. నా కోరిక నాకై కాదు; గురువులకొరకు. కావున, ముందు నీవు నా కోరిక దీర్చి తరువాత నీ యిష్టమైనట్లు చేసికొ " మ్మని ప్రార్థించెను. " అగుచో నీ కోరికయే ? " మని రా జడిగెను. " నీ భార్య మదయంతీదేవి ధరించు కుండలములు నా కీయవలయు " నని యుదంకు డర్థించెను. " ఏమిది ? ఒరుల ధనము లిచ్చువా రెటనైన గలరా ? నీకు గావలసిన నింకొక టేదైన గోరుకొమ్ము ఇచ్చెద " నని రాజు పలికెను. ఉదంకు డందుల కంగీకరింపక " నా కింకేమియు వలదు. నా కా కుండలములే కావలయు " నని పట్టుపట్టెను. " సరే నీవు పోయి నే నిమ్మంటి నని చెప్పి యామె నడిగి తెచ్చుకొను " మని రాజు తనభార్య యున్న ప్రదేశముం జూపెను.

ఉదంకు డటు వెడలి యెంత వెదకినను ఆ దేవి కన రాదాయెను. విసివి యాతడు తిరిగి రాజుకడ కేతెంచి దేవి యెందునుగాన రాలే దని చెప్పెను. " అయ్యా ! నా దేవి పతివ్రత, పవిత్ర. ఆమె యశుచులకు గానరాదు. నీవు త్రిభువనపావనుడవు. నీ వశుచి వని యెట్లందును ? " అని రాజు పలుక నుదంకుడు వృషభగోమయభక్షణంబున నశుచిత్వము తనకు కలిగియుండవచ్చు నని భావించి తూర్పుగా దిరిగి పాదములు కడుగుకొని మంత్రజపముచేసి యాచమించి రాజు ననుమతిగొని మరల దేవికడ కాతడేగెను. ఈసారి యా మహాపతివ్రత కాననయ్యెను.