పుట:MaharshulaCharitraluVol6.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

మహర్షుల చరిత్రలు


ఉదంకు డామెకు నమస్కరించి తనవచ్చినపని రాజానుమతి రెండును దెలిపెను. రాజుకడనుండి యానవాలు తీసికొని వచ్చిన దనకుండలము లిచ్చెద నని యామె పలికెను. ఉదంకుడు మరల రాజుకడకు వచ్చి యామె పలుకులు తెలిపెను. " దీనివలన మేలుకలుగు నన రాదు; అది కాదన్న వేరుమార్గము లేదు " అను పలుకులు పలికి యానవాలుగా దనభార్యకడ బలుకు మని రా జాయుదంకునకు జెప్పెను. ఉదంకుడు తిరిగి దేవి కడ కేగి రాజు పలికిన పలుకులు తు చ తప్పకుండునట్లు పలికెను. ఆ మాటలు విని మదయంతి సంతోషించి " ఋషివర్యా ! దేవతలు, గంధర్వులు, నాగులు ఈ కుండలములకోసమై వివిధొపాయములు పన్ని తస్కరింప దలచుచుందురు. ఎంగిలి సోకినను, ఏమరుపాటున నీవు నిద్రించినను, నేలమీద వీనిని బెట్టినను వారు వీనిని తస్కరింతురు. వీనిని భక్తితో బూజించి ధరించినవారికి ఆకలిదప్పు లుండవు; అగ్ని భయము కలుగదు. విషవికారము సోకదు. భూత భేతాళబాధలంటవు. పిన్నలైన బెద్దలైన వీనిని ధరింప నివి ధరించు వారి వయసును ననుసరించి చిన్నవి పెద్దవి యగుచుండును. వలసి నపుడెల్ల బంగార మివి కురియుచుండును. కావున వీనిని బదిలముగా దీసికొనివెళ్ళి మహాసాధ్వి యగునహల్యకిమ్ము. గురుకార్యమును నిర్వర్తింపుము. నీకును మాకును మేలగు " నని భక్తిప్రీతి వినయంబులు ముప్పిరిగొన ఆ మహాదానము జేసి నమస్కరించెను. ఉదంకుడపరిమానందమంది యాదేవికి హృదయపూర్వకాశీర్వచనముల నొసంగి యా కుండలముల గ్రహించి రాజుకడ కేతెంచి " రాజా ! నీవలన గృతార్థుడ నైతిని. నీకు సకలభద్రము లగుగాక ! నా కానవాలుగా నీవు చెప్పినవాక్య మతినిగూఢముగ నున్నది. దాని తాత్పర్యమును దెలిపిన సంతసించెద " నని పలికెను.

అందుల కా రాజిట్లు తెలిపెను. " ఋషివర్యా ! రాజులు బ్రాహ్మణుల బూజింతురు. నేనును విప్రుల బూజించుచునే యుండెడి వాడను. నా కీ శాపము బ్రాహ్మణునివలననే కలిగెను. ఈ శాపపరిహారమునకై విప్రసేవ తప్ప వేరుగతిలేదు. బ్రాహ్మణసేవదుస్తరము, అసిధారా వ్రతమువంటిది. " దానివలన మేలుకందు మనరాదు, అది