పుట:MaharshulaCharitraluVol6.djvu/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

12

మహర్షుల చరిత్రలు


మనియు బలికెను. అహల్య " వత్సా! నీవు పై వాడవు గావు. ఏ దక్షిణయు వలదు. నీ గురువులు చెప్పిన చొప్పున నడచుకొను " మని పలికెను. ఉదంకుడు మరిమరి యామెను విడువక ప్రార్థింపగా నామె " వత్సా! మిత్రసహు డను రాజుభార్య ధరించు కుండలములు నాకు గొనితెమ్ము. అవి ధరింప నాకు ముచ్చటగ నున్నది. దాన నా ముచ్చటతీరును. నీకు బెంపు కలుగును " అని పలికెను.

' ఇది యెంతపని ? ' యని యుదంకుడు బయలుదేరి వెడలెను. పిదప నొకనాడు గౌతము డుదంకునిం గానక యాతడే మయ్యె నని యహల్య నడిగెను. అంత నామె జరిగిన సంగతి నెరింగించెను. " అయ్యో ! మిత్త్రసహు డనురాజు శాపకారణమున రాక్షసుడై చరించు చున్నాడు. మనుష్యమాంసమును దినుచున్నాడు. ఉదంకు డీసంగతి యెరుగడు. ఆ రాజుకడ కీత డేగుచో నేమి కీడు వాటిల్లునోకదా ! " యని గౌతము డనెను.

ఈ మాటలు విని యహల్య భీతచిత్తయై " నా కా సంగతి తెలియదు. ఏదైన గోరక తప్ప దని నన్ను మరిమరి బలవంత పెట్టుటచే బంపితిని. కన్నతల్లికన్న మిన్నగా నన్ను బూజించు నుదంకున కేయపాయమును బాటిల్లకుండునట్ల నుగ్రహింపు " మని భర్తను బ్రార్థించెను. అంత గౌతము డాదరాయత్తచిత్తుడై యుదంకున కేప్రమాదమును కలుగకుండునట్లును, ఆతడు పోయిన కార్యము సిద్ధించునట్లును, ఆతని కణిమాదు లగు అష్టసిద్ధులు కలుగునట్లును, మనమున దృఢముగ దలపోసెను.

ఉదంకు డట్లు పోయిపోయి ఒక వనమున నొకగొప్ప వృషభము నెక్కి వచ్చుచున్న యొక మహాపురుషునిం గాంచి యాత డొసంగిన వృషభ గోమయమును దిని యాతని యనుగ్రహ మంది ముందునకు బయనమై పోయి మనుష్యరక్తసిక్తమగు శరీరము, కోరమీసములు, మిడిగ్రుడ్లు, భయంకరాకారము గలిగి యా శూన్యాటవి దిరుగు మిత్త్రసహు డనురాజును గాంచెను. ఆతడు " రా. రా. ఆకలి యగుచున్నది. మనుష్యమాంస మెట్లు దొరకునా యనుకొనుచుండ వచ్చితివి.