108
మహర్షుల చరిత్రలు
స్వరూపము, కర్మఫలత్యాగములను, ఆత్మజ్ఞానమును సంపాదించెను. ఆతఁడు ప్రాజ్ఞులలో ప్రాజ్ఞుఁడు, పండితులలో పండితుఁడు, జ్ఞానులలో జ్ఞాని, నిష్ఠాగరిష్ఠులలో నిష్ఠాగరిష్ఠుఁడు తపస్వులలో తపస్వియై బ్రహ్మవర్చసము, జ్ఞానతేజము, విజ్ఞానప్రకాశము తన్నావరింప బాలసూర్యునివలెఁ బ్రకాశించుచుండెను.
ప్రాజ్ఞుఁ డగునుద్దాలకుఁడు రూపగుణవిజ్ఞానసంపన్నుఁడగు కొడుకును జూచి “నాయనా! నీవు వివాహయోగ్యుఁడవై యున్నావు. బ్రహ్మచర్యము, తపస్సు, విద్య, విజ్ఞానము, రూపము, గుణము - వీనిని సంపాదించినపిదప ఆత్మజ్ఞానమును గుర్తెఱిఁగిన విప్రుఁడు వినయ వివేకగుణశాలిని యగుకన్యను బరిణయమాడి యుత్తమగృహస్థధర్మమును పాటించి సర్వఋణములను దీర్చి సన్న్యస్తచిత్తుఁడై సర్వేశ్వర సాన్నిధ్య మందుట సద్ర్బాహ్మణలక్షణము కావున, నీవును పావనముగ జీవసము గడప గృహస్థుఁడవు కమ్ము" అని పలికెను. శ్వేతుకేతుడు తండ్రిని గాదనఁజాలక యుత్తమకన్యక లభింపఁగనె తాను దప్పక పరిణయమాడుదు ననిచెప్పి తండ్రి నలరించి బ్రహ్మచర్యవ్రతమును బరిపాలించుచునుండెను.
శ్వేతకేతుని వివాహము
ఆ కాలమున మహాతపస్వి, వేదవేత్త, శాస్త్రవిజ్ఞుఁడు, ఆచారవంతుఁడు, ధర్మజ్ఞుఁడు నగుదేవలమహర్షి యా పరిసరప్రాంతముననే నివసించుచుండెను. ఆ మహర్షికి ధర్మపత్నివలన సువర్చల యను నొక కూఁతురు జనించి చక్కనిచుక్కగాఁ బెరుగుచు పుత్తడి బొమ్మవలెఁ బొలుపారుచుండెను. ఆమె తండ్రికడ సర్వవిషయములందును జక్కని వై దుష్య మార్జించెను. అందచందములతో నద్వితీయముగ నలరారు నామెకు విద్యావినయవిజ్ఞానసంవద బంగారమునకుఁ దావి యబ్బిన చందమున నబ్బెను. ఇంతచక్కని చుక్కకు నింతవిజ్ఞానరాశికిఁ దగిన వరు నెక్కడనుండి తెత్తునా యని దేవల మహర్షి తలపోయుచుండెను . తండ్రితలపోఁత తనయ గుర్తెఱింగి " తండ్రీ ! నీవు నాకుఁ దగినవరు నన్వేషింపఁ దలపోయుచుండుట నే నెఱింగితిని. కాని, నాకొక్కకోరిక