పుట:MaharshulaCharitraluVol6.djvu/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్వేతకేతుమహర్షి

107


వేల కూర్చుంటివి? నీవు నీ తండ్రికడకుఁ బొమ్ము” అని యాతనిని గెంటివేసి తాను దండ్రియొడిలోఁ గూర్చుండెను. అష్టావక్రుఁ డేడ్చుచుఁ దల్లికడ కేఁగి జరిగిన సంగతి చెప్పి తనతండ్రి యెక్కడఁ గలఁడో తెల్పుమని కోరెను. ఆమె జనకసభలో వాదమున నోడి జలమజ్జితుఁడై యాతని తండ్రి యుండె నని చెప్పెను. “ఐనచో నే నేగి నాతండ్రిని విడిపించి తెచ్చుకొందును. అనుమతింపు" మని తల్లినిగోర నామె "బాలవాక్యము బ్రహ్మవాక్యము. ఏమో ! తేజస్వియగుబాలుఁ డంతకుఁ సమర్థుఁడు కాఁడనుకొననేల?” యని యాతని కనుమతి నొసంగెను.

వెంటనే అష్టావక్రుఁడు మేనమామయగు శ్వేతకేతుని కడకుఁ బరుగునఁ బోయి యాతఁడు తన్ను గెంటివేసి యవమానించిన సంగతి యప్పుడే మఱచి, "మామా ! మన మిద్దఱము జనకచక్రవర్తిసభ కేగి వంది నోడించి నా తండ్రిని విడిపించుకొని వత్తము. రమ్ము. వందిని గిందిని పందిని జయింపలేమా మనము? ” అనెను. ఆతఁడును తప్పక పోదము రమ్మనఁగా ముక్కుపచ్చలారని యా ముద్దుబిడ్డ లిరువురుఁ జెట్టాపట్టాలు వేసికొని బాలసూర్యులవలెఁ బయలుదేఱి జనకసభను జేరి వారి వాక్చమత్కృతులచే ద్వారపాలురను జనకుని రంజింవఁ జేసిరి. అష్టావక్రుఁడు వాదమున వంది నోడించి జనకుని గౌరవము లంది తండ్రిని విడిపించుకొని తండ్రియాజ్ఞచే సమంగానదిలో మునిఁగి నిర్వక్రుఁడు దివ్యసుందరుఁడునై తనతోఁ దుల్యుఁ డని జనకాదులచే ననిపించుకొన్న మేనమామ యగుశ్వేతకేతునితో విజయియై యింటికి విచ్చేయఁగా నెల్లరు మాతులభాగినేయుల లోకాతీతశక్తుల కచ్చెరువందిరి.

శ్వేతకేతుఁ డచిరకాలముననే సర్వవేదశాస్త్రములను తద్రహస్యములను, ధర్మమర్మములను దెలిసికొని పున్నమచంద్రునివలె షోడశ కళాపరిపూర్ణుఁడై ప్రకాశింపఁ జొచ్చెను.

శ్వేతకేతుని విజ్ఞానము

శ్వేతకేతుఁడు బ్రహ్మచర్యదీక్ష వహించి మహాతపస్సు చేసెను. ఆ పిమ్మట నాతఁడు బ్రహ్మజ్ఞానమును గడించి వేదతత్త్వము, క్రియా