Jump to content

పుట:MaharshulaCharitraluVol6.djvu/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

శ్వేతకేతు మహర్షి

జననము

పూర్వము మహాతపస్వియు, మహాతేజస్వియు, మహాస్వాధ్యాయ వేత్తయు నగుఉద్దాలకుఁ డను మహర్షి యుండెను. ఆతఁడు మంత్ర ద్రష్టయు, మంత్రవేత్తయు, మంత్రమహితుఁడును. అతనికి ధర్మపత్నియందుఁ దొలుత సుజాత యనుకూఁతురు కలిగెను. యుక్తవయసు వచ్చినపిదప నుద్దాలకుఁ డామెను ఏకపాదుఁ డనుమహనీయ తపోనిధి కిచ్చి వివాహముఁ గావించెను. ఆ పుణ్యదంపతులకే అష్టావక్ర మహర్షి యుద్భవించెను. సుజాతకు అష్టావక్రుఁడు జనించిన వేళనే సుజాతతల్లియు ఉద్దాలకునిభార్యయు నగు సాధ్వికి నొక కుమారుఁడు కలిగెను. ఆతఁడు స్వచ్ఛధావళ్యయుత మగుశరీరముతోఁ బుట్టుటచేఁ దండ్రి యాతనికి శ్వేతకేతుఁ డనునామము నొసంగి జాతకర్మాదుల నొనరించెను.

మాతుల భాగినేయులు

సమానవయస్కులు సమానబుద్ధియుతులు నగు శ్వేత కేతుఁడు, అష్టావక్రుఁడు మాతులభాగినేయు లగుట సుజాతచేతను సుజాతతల్లిచే తను మిగుల లాలింపఁ బడుచుండిరి. జనకమహారాజు నాస్థానమున కేగి వందితోడి వాదమున నోడి యేకపాదుఁడు జలమజ్జితుఁడై యుండుటచే అష్టావక్రశ్వేతకేతు లిరువురు ఉపనీతులై ఉద్దాలకునికడనే సమస్త వేదశాస్త్రములు నభ్యసించుచుండిరి. అష్టావక్రుఁడు బాల్యముకతమున ఉద్దాలకుఁడే తండ్రి యనియు శ్వేతకేతుఁడు భ్రాత యనియు భావించు చుండెను. ఒకనాఁడు అష్టావక్రుఁడు చనవుబలిమిని ఉద్దాలకునియొడిలోఁ గూర్చుండెను. అదిచూచి శ్వేతకేతుఁ “ డోరీ ! నాతండ్రియొడిలో నీ