పుట:MaharshulaCharitraluVol6.djvu/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

మహర్షుల చరిత్రలు

ఇట్లుండ విష్ణుమూర్తి వామనుఁడై బలిని యాచింప వచ్చుటయు, బలి వామనుఁడు కోరిన మూఁడడుగులభూమిని దానముచేయ నంగీకరించుటయు జరిగెను. అపు డీసంగతి విని తన దివ్యదృష్టిని జరుగఁ బోవున దెఱిఁగినవాఁ డయ్యు శుక్రాచార్యుఁడు తనవిధి తాను నిర్వర్తింపఁ దలఁచి బలిని జేరి యిట్లు పలికెను. “దనుజేంద్ర ! ఈ పొట్టివాఁడు చాల గట్టివాఁడు. బడుగు బాపనయ్య కాఁడు. దేవకార్యము సాధించుటకై యీవటువు రూపమున నీకడకు వచ్చినాఁడు. ఈ సంగతి నీ వెఱుంగక యీతనికి నీవు దాన మిచ్చెద నంటివి. ఇచ్చితివా రాక్షసలోకమున కంతకు ముప్పు తెచ్చినవాఁడవే యౌదువు. ఈతఁ డీ మూఁ డడుగుల దానము మిషచే నీ లక్ష్మీ, నీ తేజము, నీ యిల్లు, నీ యైశ్వర్యము, నీ సమస్తముఁ గొనిపోయి యింద్రుని కిచ్చును. మూఁడుపాదములతో మూఁడు లోకముల నాక్రమించి నిన్నుఁ బాతాళమునఁ గూల్చును. ఇచ్చెదనని ఈయకున్న చో నరకమే వచ్చును. కాని, దానిని దప్పించుకొన నీవు సమర్థుఁడవు. ఏ దానమున వినాశము సంభవించునో యది దానమే కాదని పెద్ద లందురు. గృహస్థుఁ డగువాఁడు తనయింటఁ గలధన మైదుభాగములుగాఁ జేసి కామము, అర్థము, ధర్మము, యశము, ఆశ్రితజనము అనునై దిటికి సమముగాఁ బంచవలయును. అంతేకాని తనకు మాలినధర్మము ధరణి లేదు. “బహ్వృచగీత " ఈ భావమునే తెలుపును. వినుము. అంగీకరించినను, అఖిలము పోవునపుడు లే దనిన అసత్యము కాదు. ఆత్మ యనువృక్షమునకు అసత్యము మూలము. ఐనను ఆత్మ చెడదు. ఆత్మ యనువృక్షమునకు సత్యము పుష్పఫలములు. మ్రాను చెడుటతో పుష్పఫలములును పోవును. ఫలపుష్పములు లేకపోయినను వృక్షము మూలముతో వృద్ధిపొందును. కావునఁ దాను నశింపకుండు పక్షమున దానము చేయవలయును గాని తానే పోవునపుడు దానము చేయుట తెలివిగలపని కాదు. మఱియును

వారిజాక్షులందు వై వాహికములందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకితగోకులాగ్రజన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొందఁ డధిప!