పుట:MaharshulaCharitraluVol6.djvu/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక్రమహర్షి

99

కాలక్రమమున శర్మిష్ఠకుఁ గొడుకుపుట్టి పెరుగుచుండ దేవయాని చూచి యా కొడుకెట్లు పుట్టె నని శర్మిష్ఠ నడిగెను. ఒకమునీశ్వరుని దయచేఁ గలిగె నని శర్మిష్ఠ బొంకెను. దేవయాని యది నిజమని నమ్మి వెడలిపోయెను. యయాతి యతి రహస్యముగా శర్మిష్ఠాసంగమ మొనరింప నామెకుఁ గ్రమముగా నాతనివలన మువ్వురుపుత్రు లుదయించిరి.

కాలక్రమమున నొకనాఁడు శర్మిష్ఠాయయాతుల గుట్టు బట్టబయలు కాఁగా దేవయాని సమస్తము నెఱింగి తండ్రికడకుఁ బోయి తనభర్తయగు యయాతి యధర్మమున ధర్మమునకుఁ గీడు కలిగించి, ఆసురపద్దతి నాసురియందు ముగ్గురుకొడుకులఁ గని తన కవమానము కల్గించెనని యేడ్చెను. శుక్రుఁడు కోపముతో వచ్చి యయాతిం జేరి " నీవు యౌవనగర్వమున రాగాంధుఁడవై నాకూఁతున కప్రియము చేసితివి. జరాభారపీడితుఁడవు క"మ్మని శపించెను. యయాతి ఖేదపడి తనకుఁ గామసుఖము తీరలే దని శాపముఁ బాపుమని ప్రార్థించెను. శుక్రాచార్యుఁడు “నీ ముదిమి నీ కొడుకునకిచ్చి యాతని యౌవనము నీవు తాల్చి రాజ్యసుఖంబు లనుభవింపవచ్చు. తుదిని నీముదిమి నీవు తాల్చి నీ కుమారునియౌవన మాతని కీయవచ్చు. అట్లొడంబడిన కుమారునికే నీవు రాజ్య మీయవలయు. అతఁడే వంశకర్త యగు"నని శాపము మార్చి కూఁతు నూఱడించి యయాతిఁ దృప్తిపఱచి వెడలిపోయెను.*[1]

శుక్రాచార్యుఁడు బలిచక్రవర్తికి నీతి బోధించుట

శుక్రుడు బలికి సమస్త నీతులను బోధించి యాతనినిఁ జక్రవర్తి నొనరించి దేవతలయు, ఇంద్రునియు, దిక్పాలకులయు గర్వ మణఁవం జేసి యాతనిచే శతాధికములగు యజ్ఞములు చేయించి దానము లొనరింపఁజేసి సత్యము, దయ, ధర్మము, త్యాగము, యోగము పంచప్రాణములుగా నొనరించి జగజ్జేగీయమానముగాఁ దనయాచార్యత్వము నిర్వహించెను.

  1. *భారతము ఆదిపర్వము భాగవతము, నవమస్కంధము.