పుట:MaharshulaCharitraluVol6.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

మహర్షుల చరిత్రలు

ఒకనాఁడు శర్మిష్టయు నామె పరివారమును దన్ను సేవించుచుండ దేవయాని వనవిహారమున కేగెను. దై వికముగా నచట యయాతిమహారాజు తటస్థపడెను. ఆతఁడు దేవయానిం బలుకరించి మిగిలినవారంద ఱెవ్వ రని యడిగెను. దేవయాని సమస్తము నాతనికి జెప్పి తన్నుఁ బెండ్లాడు మని ప్రార్థించెను. అంత యయాతి క్షత్త్రియుఁడు బ్రాహ్మణకన్యను బరిగ్రహించుట ధర్మవిరుద్ద మని తా నధర్మమునకుఁ బాలుపడుచో లోకప్రవృత్తి విపరీత మగు నని వాక్రుచ్చెను. “ఐనచో, నాతండ్రి చెప్పిన నంగీకరింతువా? ” యని యయాతి నడుగ నాతఁ డంగీకరింతు ననెను. వెంటనే దేవయాని తండ్రిని బిలిపించి విషయ మంతయుఁ జెప్పెను. శుక్రాచార్యుఁడు వారివివాహ మధర్మము కాకుండునట్లు వర మను గ్రహించి వారికి వివాహ మొనరించి తన కూఁతుతోపాటు శర్మిష్ఠను సఖులను రాజున కొప్పగించి వడుక తక్క దిక్కినన సమస్తసుఖములు నామె కొసంగు మని చెప్పి యయాతి నొప్పించి శుక్రాచార్యుఁడు వారందరిని యయాతితోఁ బంపివేసెను. కాలక్రమమున యయాతి దేవయానివలన యదుతుర్వసు లను కుమారులం గాంచెను.

శర్మిష్ఠ యౌవనవతియై తనయంద మంతయు నడవిని గాచిన వెన్నెల కాఁగా దుఃఖించుచుఁ దనకుఁ బతి లేఁడయ్యె నని కృశించుచు యయాతితోడి సంగమము మనసునఁ గోరి యుండఁగా నొకనాఁడు దైవికముగా నామె యొంటరియై యున్నప్పుడు యయాతి యొంటరిగా నరుదెంచెను. అపుడు శర్మిష్ఠ చేతులు జోడించి నమస్కరించి తనకు సంగమసుఖ మిమ్మని ప్రార్థించెను. “శయన సుఖముతక్క మిగిలిన సుఖములు నీ కిమ్మని శుక్రుఁడు నా కాదేశించినాఁడు. దానికి విరుద్ద మొనరించిన నసత్యదోషము నాకువచ్చు" నని యయాతి పలుక శర్మిష్ఠ "దేవా! ప్రాణవిత్తమాన భంగములందు వివాహవధాసమయములను బొంకవచ్చు ననుట ధర్మబద్దము కావున నన్నేలు" మని పైఁబడెను. అసదృశరూప యౌవనవిలాసిని యగునామె కా మహారాజటనే యపుడే యామె కోరిన కామసుఖము నపారమొసంగి గర్భము నిలిపి చనెను.