పుట:Maharshula-Charitralu.firstpart.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

మహర్షుల చరిత్రలు


ఆ పరిసరముల నొక నగర మాతఁడు నిర్మించెను. అది 'కాశ్యప' యను పేరఁగాశీక్షేత్రమున కెనయై విలసిల్లెను. కశ్యపసంబంధమైన యే క్షేత్రమున నే తీర్థమున జనుఁడు స్నానమాచరించినను, దర్శించినను. సకల పాపక్షయ మంది యాతఁడు ముక్తినందును.[1]

కశ్యపుఁడు భూమిని రాజులకుఁ బంచి యిచ్చుట

కొంతకాలమునకు భూమిపై ధర్మము నశించి యధర్మము పెరుఁగఁ జొచ్చెను. బ్రాహ్మణులు యజ్ఞయాగములు మాని యకృత్యములకుఁ జొచ్చిరి. ఈ మహాదోషములచే భూమి పాతాళమునకుఁ బోవుచుండఁగాఁ గశ్యపమహర్షి తనతొడఁ గ్రుచ్చి దాపుచేసి యెత్తఁగా భూదేవి మరలఁ బూర్వరూపమున నుండెను. అంతఁ గాశ్యపి కశ్యపమహర్షికి నమస్కరించి యుత్తమక్షత్రియులు దండనీతిచే ధర్మమును రక్షించి తన్ను సురక్షితఁ జేయున ట్లనుగ్రహింపఁ గోరెను. అపుడు కశ్యపుఁడు .పరశురామునిచే జావని రాజు లెవ రనెను. భూదేవి సంతసించి హైహయులు కొందఱు పౌరవంశజుఁడగు విదూరథుని కొడుకును ఋక్షపర్వతమున ఋక్షములు రక్షించుటయు, సౌదాసుని వంశమువాఁ డొకఁడు పరాశరమహర్షి "యజ్ఞమున శూద్రకర్మలు చేయుచు బ్రదికి యుండుటయు, శిబి మనమఁడు గోపతియను వానిని వనమున గోవులు రక్షించుటయుఁ, బ్రతర్దన పుత్త్రుఁడు వత్సరాజు నట్లే జీవించియుండుటయుఁ జెప్పి వారిని బిలిపించి యధిపతులఁ జేయు మని ప్రార్థించెను. కశ్యపమహర్షి యానందించి యా రాజసుతుల నందఱఁ బిలిపింప వారెల్లరు విచ్చేసి కశ్యపునకు నమస్కరించి నిలిచిరి. కశ్యపుఁడు వారందఱుకు భూమిని విభజించి యొసఁగి పరిపాలింపుఁ డని యభిషేక మాచరించి పంపెను. క్రమముగా నా నృపులవంశములం దనేకులు పుట్టి ధరణిభారము వహించిరి.

  1. పద్మపురాణము - ఉత్తరఖండము.