పుట:Maharshula-Charitralu.firstpart.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కశ్యప మహర్షి

81


విలసిల్లునట్లు గంగానదిని భూమిపైఁ బ్రవహింపఁ జేసి లోకక్షేమముఁ జేకూర్చి మాకోరిక తీర్పు" మని ప్రార్థించిరి.

కశ్యపుఁడు వారికోరికఁ దీర్ప నెంచి వెంటనే అర్బుథాద్రి కేఁగి యందు ఘోరనిష్ఠతోఁ బరమశివుని గుఱించి చిరకాలము మహాతపస్సు చేసెను. అంత శివుఁడు కనికరించి ప్రత్యక్షమై వరము కోరుకొనుమని కశ్యపునితో ననెను. కశ్యపుఁడు గంగను భూలోకమునఁ బ్రవహింపఁ జేయుమని కోరెను. శివుఁడట్లేయని తన జడనుండి గంగానది నొకపాయగా విడిచెను. కశ్యపుఁ డట్లు కృతార్థుఁడై పరమ శివుని భజించి గంగతో నైమిశారణ్యమునకుఁజని ఋషుల నానందింపఁ జేసెను. వారు బ్రహ్మానందపడి కశ్యపు నభినందించి ఆ గంగా వాహినికి 'కాశ్యపి' యను పే రొసంగిరి. ఈ 'కాశ్యపి' యే కృతయుగమున 'కృతవతి' యనియు, త్రేతాయుగమున 'గిరికర్ణిక' యనియు, ద్వాపరయుగమున 'చంధన' యనియు, కలియుగమున ' 'సాభ్రమతి' యనియు జగద్విశ్రుతినిఁ గాంచెను.

సాభ్రమతీనది సకల పాపసంహారిణి. ఈ నదీ-తీరమున యవక్రీతరైభ్య భృగ్వంగిరో దత్తాత్రేయ విశ్వామిత్ర భరద్వాజాది మహర్షులు తపోనిష్ఠులై నిత్యనివాసముండిరి. నీలకంఠ, నందహ్రద, రుద్రహ్రద, రుద్రమహాలయ తీర్థములును, మందాకినీ, అచ్ఛోద సాభ్రమతి యందు గూఢముగాఁ బ్రవహించును. ఈ సాభ్రమతీ నదీమతల్లి వలననే బ్రహ్మచారి, వికీర్ణ. శేత, గణాగ్ని హిరణ్యా సంగమాప్సరస స్తీర్థములును ; కపితీర్థ, మంకితీర్థ, పిప్పలాద, నింబార్కా ది మహాతీర్థము లనంత మేర్పడెను.

కశ్యపమహర్షి తప మొనరించిన యా ప్రదేశము 'కాశ్యపతీర్థ' మనఁ బరగెను. అం దాతఁడు నిర్మించిన కుండమునకు 'కాశ్యపకుండ' మను పేరువచ్చెను. అందాతఁడు కుశేశ్వరుని సంస్థాపించెను. మఱియు