పుట:Maharshula-Charitralu.firstpart.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కశ్యప మహర్షి

83



కశ్యపుఁ డదితివలన వామనునిఁ గనుట

తొల్లియొకసారి బలిచక్రవర్తి భృగ్వాది బ్రహ్మవాదుల నర్చించి యనంత బలోపేతుఁడై స్వర్లోక మాక్రమించెను. ఇంద్రాది దేవతలెల్లరుఁ గామరూపముల ధరించి తమతమ తోఁచినచోట్ల కేఁగిరి. బలి యైశ్వర్య విభవుఁడై యుండ భృగ్వాదు లతనిచే శతాశ్వ మేధములు చేయించిరి. ఇట్లుండఁగా, నదితి తన బిడ్డలపాటు సవతి బిడ్డల యైశ్వర్యము నరసి చింతాక్రాంతయై యుండఁగా నొకనాఁడు కశ్యపమహర్షి -భార్యపాలి కేతెంచి యోగక్షేమ మడిగెను. అదితి తన బిడ్డల దుస్థ్సితిని దితి బిడ్డల ప్రాబల్యమును జెప్పి తనబిడ్డల సంరక్షింపుమని భర్తను వేఁడుకొనెను. కశ్యపమహర్షి భావికాలగతు లూహించి నారాయణుని బ్రార్థింపు మని తనసతి కుపదేశించెను. ఏవ్రతముచే నారాయణు నుపాసింతునని యామె యడుగఁ గశ్యపుఁడు 'వయోభక్షణ' మను వ్రతమామె కుపదేశించి తత్కాల మంత్రములఁ జెప్పెను. అదితి యట్లు చేయఁగా నారాయణదేవుఁడు ప్రత్యక్షమై తా నామెకుఁ గుమారుఁ డై పుట్టి యభీప్సితముఁ దీర్తుననియుఁ బుత్త్రోత్పత్తికి భర్తను సేవింపు మనియుఁ జెప్పి యంతర్హితుఁడయ్యెను. అదితియు నానందముతో భర్తకు శుశ్రూష చేయుచుండఁగా నొకనాఁడు కశ్యపుఁ డామేతో భోగించి యచ్యుతువంశ మాత్మ నొలయ దాని నదితి గర్భమునఁ జేర్చెను, అంత నదితి గర్భవతియై కాలక్రమమున నారాయణుఁ గనెను. శంఖచక్రగదాధరుఁడు కౌస్తుభాభరణుఁడునైన హరి తన గర్భమున నెట్లుండెనని యదితి వెఱఁగుపడఁగాఁ గశ్యపుఁ డాతని ననేక విధముల స్తుతించెను. అంతఁ నారాయణుఁడు రూపాంతకమును గ్రహించి వామనుఁడై కశ్యపునింటఁ బెరుఁగఁజొచ్చెను.

కశ్యపమహర్షి మహర్షులఁ బురస్కరించుకొని యుక్త కాలమున వామనున కుపనయనము చేయ, సవిత సావిత్రి నుపదేశించెను ; బృహస్పతి యజ్ఞోపవీత మొసఁగెను. కశ్యపుఁడు మౌంజి నిచ్చెను;