పుట:Maharshula-Charitralu.firstpart.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

మహర్షుల చరిత్రలు


వరులు గాననైరి. దివ్యసౌరభములు నిండఁగ రమణీయరోచుల నీను రత్నాలంకారముల ధరించిన స్త్రీలు వింజామరలు వీచుచుండఁగాఁ సౌందర్యనిధియైన యొక స్త్రీ పాదములొత్తుచుండఁగా గపిలమహర్షి కనుమోడ్చి నిదురించుచుండెను. రావణుఁడు చెంత కేఁగ నతఁడు లేచెను. రావణుఁడు విస్మితుఁడై, యాతని యపూర్వ చరిత్ర మడిగెను. కపిలమహర్షి రావణుఁడు త్వరలోఁ జంపఁబడనుండు టెఱిఁగించి నోరు తెఱచెను. అందు విశ్వరూపము ప్రత్యక్షమయ్యెను. రావణుఁడు భీతచిత్తుఁడై యాతనికి నమస్కరించి "మహాత్మా ! నీ చేతిలోఁ జనిపోవుటకంటె శుభము వేఱొకటి లేదు. నే నందుకొఱకే నిన్నీ విశ్వమున విసుగు విరామములు లేక వెదకుచున్నా" నని కడుఁగడుఁ బ్రశంసించెను. ఇంతలో గిరితో గుహతోఁ గపిలమహర్షి యంతిర్హితుఁ డయ్యెను. రావణుఁడు పరమవిస్మయచిత్తుఁడై యట నుండి వెడలి పోయెను.[1]

కపిలమహర్షి యవతారముమూలమున లోకము గడించినది కపిలాచార్యుని సాంఖ్యతత్త్వము. భక్తియోగమునకు శ్రుతిస్మృతులకుఁ బ్రమాణ్య మొసఁగి యిది విఖ్యాతి నార్జించినది. సూర్యరశ్మితోఁ బలికిన పలుకులవలనఁ గపిలుని వేదప్రామాణ్య బుద్ధి. మాతృశ్రీ యగు దేవహూతికి బోధించిన భక్తియోగము నిట్లనుటకు సాక్షిభూతములు. కపిలమహర్షి తండ్రితోఁ జెప్పినట్లవతార మెత్తి మునివేషము గైకొనుట ఋషిజనములను దన్మూలమునఁ బ్రజానీకమును దత్త్వబోధామృతముచేఁ బునీతులను జేయుట కే యనుట నిస్సంశయము. ఆ మహర్షి వర్యుని బోధామృతమును దనివితీఱఁ గ్రోలి భక్తుల జరామరత్వముల నంది తమజీవితములను సార్ధక మొనరించుకొందురుగాక !



  1. ఉత్తర రామాయణము.