పుట:Maharshula-Charitralu.firstpart.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపిలమహర్షి

75


యైశ్వర్యాదుల ననుభవించుచున్నను భగవద్భక్తి విడువని వాఁడు రాజస భక్తుఁడు. పాప పరిహారమునకై భగవదర్పణ బుద్దితో గర్మములు చేయుచు జన హితకారియై భక్తుఁ డగువాఁడు సాత్త్విక భక్తుఁడు. పరమేశ్వరుని గుణములను వినుటచేఁ గలిగిన భక్తిచే నైన నాతనిపై మనస్సును నిల్పినవాఁడును బరమభక్తుఁ" డని కపిలుఁడు భక్తియోగమును దదనంతఫలమును విశదీకగించెను[1]

కపిలమహర్షి రావణునకు విశ్వరూపము చూపుట

కపిలమహర్షి యొకప్పుడు పశ్చిమ సముద్ర తీరమున నొక యరణ్యములోఁ బద్మాసనస్థుఁడై కన్నుఁగవ మూసికొని యాత్మయోగ సుఖ మందుచుండెను. అప్పుడు రావణుఁడు వరగర్వముచే బలవంతుల నందఱను జయించు నుద్దేశముతోఁ దిరుగుచుఁ గపిలమహర్షిని గాంచెను. రావణుని కంటికిఁ గపిలమహర్షి నేత్రాంచలముల నగ్ని శిఖలు, బాహువుల యందు బహుళితాయుధములు, శరీర మందెల్ల మరుద్వసు రుద్ర సంఘములు గాననై దుస్సహముగాఁ గాన వచ్చెను. మఱియుఁ గపిలమహర్షి యురమున లక్ష్మీదేవియు, శల్యముల మరుద్గణములు, కడుపున సముద్రములు, కన్నులలో సూర్య చంద్రులు, ధాత, విధాత, రుద్రాదులు మున్నగువారెల్లరు నాతని శరీరమునఁ గాననైరి. రావణుఁ డిది ఋషులమాయ యని వానిపై ననేక శస్త్రాస్త్రములు ప్రయోగించెను. వెంటనే కపిలమహర్షి "ఓరీ ! చెడుగా ! నన్ను సాధింప వచ్చితివా?" యని పిడికిలిచేఁ బొడిచెను. దానితో రావణుఁడు మూర్ఛపడెను. తోడి దైత్యులాతని నెదిరించిరి. కపిలుఁడు దైత్యుల హుంకరించి గుహాభ్యంతరమున కేఁగెను. రావణుఁడు కొంత సేపటికి మూర్చ దేఱి యాతని సాధింప నెంచి బాణ కృపాణాదులతోఁ గపిలుని గుహఁ బ్రవేశించెను. అందు మహావీరులు దేవసుతులు, సిద్ధులు, శంఖచక్రాదులు ధరించి చతుర్భుజులైన పురుష

  1. భాగవతము -- తృతీయస్కంధము.