పుట:Maharshula-Charitralu.firstpart.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపిలమహర్షి

73


కపిలుని మాహాత్మ్యమున సభాసదు లెల్లరంతర్థానమైరి, యజ్ఞశాల దుష్టమృగములతో నిండిపోయెను. అశ్వశిరుఁ డతిభయాకుల చిత్తుఁడై కపిలమహర్షి యే విష్ణుమూర్తి యను పూర్ణవిశ్వాసము కలుగఁగాఁ దిరిగి యాతనిఁ బ్రార్థించెను. వెంటనే కపిలుఁడు ప్రత్యక్షమయ్యెను. సభాసదులు వచ్చిరి. దుష్టమృగము ఆంతర్ధానమయ్యెను. అశ్వశిరుఁడు కపిలమహర్షి పొదములపైఁ బడెను. కపిలమహర్షి యాతనిఁ గటాక్షించి “రాజా! నీవు విష్ణుభక్తుఁడవు, విష్ణునెట్లు వశపఱచుకొనఁగలవని యడిగితివి. బ్రహ్మాది స్తంబపర్యంతము విష్ణుమూర్తి రూపమే యని గ్రహించిన, నాతఁడు నీకు వశుఁ డగును. విష్ణుఁడు సర్వాంతర్యామి సర్వము నని నిరూపించుట కిట్లు చేసితిని. ఇఁకనైన నీ వది గ్రహించి కులోచిత ధర్మములను వేదవిహితాచారములను నెఱవేర్చుచు సుజ్ఞానము నందిన మోక్షము నందఁగలవని బోధించి కపిలమహర్షి జైగీషవ్యునితో వెడలిపోయెను.[1]

కపిలుని సాంఖ్యసిద్ధాంతము

కపిలమహర్షి సాంఖ్యయోగమును బోధించిన మహాత్ముఁడు, "విషయములవిధము తెలిసికొని శ్రుతివాక్యములచే వాని తత్త్వమును గ్రహించి దృఢజ్ఞానముచే వానిని విడిచిపెట్టవలయును. ఆయువు క్షణిక మనియు సుఖదుఃఖములు కాలగతి వచ్చు ననియు నెఱుఁగవలెను. కర్మతత్త్వము వేద చోదనముల విధము గ్రహించి సత్త్వరజస్తమోగుణములచే బుద్ధికిఁ గలుగు ప్రవర్తనముల గుర్తెఱుఁగ వలయును. పంచేంద్రియములు గోష్ఠమునందు. నగ్ని వాయువులు బయలను, పావకునందుఁ దోయములును, భూమి తోయములందును, బలము కౌశికునందును, గ్రాంతి యు పేద్రునందును, నర్థమున లోభమును, మనస్సున బుద్దియు, రజస్సునఁ దమస్సును, సత్త్వమున రజస్సును దగులును. సత్త్వమాత్మఁ దగులును. ఆత్ముఁడు నారాయణుఁ

  1. వరాహపురాణము.