పుట:Maharshula-Charitralu.firstpart.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపిలమహర్షి

71


కాల మా మంత్రమును జపించి విష్ణుదేవుని బ్రత్యక్షము చేసికొని యాతని కటాక్షమున మోక్షమునందెను [1]

కపిలమహర్షి సగరపుత్త్రుల భస్మముచేయుట

మఱియొకప్పుడు సగరచక్రవర్తి విష్ణుప్రీతికొఱకై యనేకాశ్వ మేధయాగములఁ జేసి తృప్తిగనక మఱియొక మఖమును జేయ హయమును విడిచెను. అసూయాగ్రస్తుఁడై యింద్రుఁ డాగుఱ్ఱమును నాగలోకమునకుఁ దీసికొనిపోయి యట నొకచోఁ దపోనియతి నున్న కపిలమహర్షి యాశ్రమ సామీప్యమునఁ గట్టివైచి వెడలిపోయెను. యాగాశ్వ సంర కషణమునకై సగరుఁడు నిజపుత్త్రులఁ బంపెను. వారు చని యేడుదీవులు వెదకి యశ్వముఁ గానక భూమిఁ ద్రవ్వి పాతాళ లోకమున కేఁగిరి. అందుఁ దిరిగి వారు కపిలమహర్షి యాశ్రమ ప్రాంగణమున నున్న యశ్వముఁ జూచి యాతఁడే దానిని హరించి యుండె నని భావించి యాతనిఁ జంప నేఁగిరి. కపిలమహర్షి కనుదెఱచి చూచెను. వెంటనే సగరపుత్త్రు లరువది వేల మందియు భస్మీ భూతులై పోయిరి. తరువాత సగరుఁడు మనుమఁడగు నంశుమంతుని బంప నాతఁడు పాతాళమున కేఁగి యందుఁ గపిలాశ్రమ సామీప్యమున భస్మరాసుల పొంతనున్న యశ్వమును జూచి కపిలమహర్షికిఁ బ్రణమిల్లి యనేక విధములఁ బ్రార్థించెను. కపిలుఁడు “బుద్ధిమంతుఁడా! గుఱ్ఱమును దోలుకొనిపోయి మీ తాత జన్నముఁ బూర్తిసేయింపుము. వెఱ్ఱులై నీతండ్రు లిట భస్మమైరి. గంగాజలములు వీరిపైఁ బ్రవహించిన వీరికి ముక్తికల్లు"నని యనుగ్రహించెను. అంశుమంతుఁడు కపిలు ననుగ్రహమునకుఁ బాత్రుఁడై తండ్రుల దుఃస్థితికి విచారించి యాగాశ్వమును గొనిపోయి తాత యశ్వమేధమును బూర్తి చేయించెను. తుదకు భగీరథుఁడు గంగా జలమును బాఱింపఁ జేసి సగరపుత్త్రులకుఁ బుణ్యలోకము లొసఁగెను.[2]

  1. మత్స్యపురాణము
  2. భారతము, భాగవతము - బ్రహ్మాండపురాణము.