పుట:Maharshula-Charitralu.firstpart.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋష్యశృంగ మహర్షి

61


విధములఁ బూజించెను. రోమపాదుఁడు దశరథు ననేక విధముల సమ్మానించెను. . అంత దశరథుఁడు, శాంతా సహితుండై ఋష్యశృంగుఁడును భార్యాసమేతుఁడై రోమపాదుఁడును దన గృహమునకు విచ్చేయవలయునని ప్రార్థించెను. శాంతా ఋష్యశృంగు లంగీకరించిరి. రోమపాదుఁడు తరువాత వచ్చెద నని కృతాలింగనుఁడై దశరథుని శాంతా ఋష్యశృంగులను వీడ్కొలిపి యయోధ్యకుఁ బంపెను.

శాంతా ఋష్యశృంగులతో దశరథుఁ డయోధ్యఁ బ్రవేశించుసరికి నగర మంతయు నద్భుతముగా నలంకరింపఁబడి యుండెను. పురసతులు లాజలు, అక్షతలు, దళత్కు సుమములు వారి పైఁ జల్లిరి. నానాజయవాదులై న జనులు మ్రొక్కిరి. అంతలో రాజప్రాసాదమును సమీపింపఁగానే రాజనిభాననలు మహితరత్నసమాన నీరాజనరాజితో నెదురువచ్చి వారికి హారతులిచ్చిరి. అంత దశరథుఁడు రథము దిగి ఋష్యశృంగుని గారవముతో మంగళతూర్యఘోషములతో లోనికి దీసికొనిపోయెను. పుణ్య స్త్రీలు శాంతాదేవి నంతఃపురమునకుఁ గొనిపోయిరి. కౌసల్యా కైకేయీ సుమిత్రాదు లమితానందముతో 'అమ్మా! శాంతా ! ఇఁక నీవు మా బిడ్డవు కావు. మాకుఁ బూజనీయవైన మహర్షి పత్నివి, వందనము లమ్మా!' యని మేల మాడిరి. శాంత చిఱునగవుతో వారిని గౌఁగలించుకొనెను. శాంతా ఋష్యశృంగుల కట ననుక్షణము నధిక పూజలు జరుగుచుండెను.

ఋష్యశృంగుడు దశరథునిచే నశ్వమేధ పుత్త్రకామేష్టులఁ జేయించుట

ఇట్లుండఁగా యజ్ఞనిర్వహణానుకూలమగు వసంతకాల మరుదెంచెను. బహుపాదములతోపాటు దశరధుని మనోవృక్షమును జక్కఁగాఁ జిగిర్చెను. అంత నాతఁడు ఋష్యశృంగుని జేరఁ బిలిచి పుత్త్రకామేష్టిచేయు నుద్యమముఁ దెలుపఁగా నాతఁ డంగీకరించెను,