పుట:Maharshula-Charitralu.firstpart.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

మహర్షుల చరిత్రలు


దశరథునిఁ జంప నుంకించటయు వశిష్ఠమహర్షి కోరికపై దశరథుని కొమార్తెను బ్రాహ్మణునకే యిచ్చి వివాహము చేయవలెనని శాసించి చంపక విడిచి వెడలుటయుఁ జెప్పెను. ఋష్యశృంగుఁ డానందించి శాంతను వివాహ మాడఁగోరెను. రోమపాదుఁ డానందతరంగముల నోలలాడి వెంటనే వివాహ వైభవమును బురమందెల్లఁ జాటఁ బంపెను. తరువాత మహా వైభవముతో శాంతా ఋష్యశృంగుల వివాహము జరిగెను. ఋష్యశృంగుఁడును రోమపాదునివలన బహువిధ సమ్మానముల నందుచుఁ గాంచనమయ శయ్యాసనమున శాంతా సహితుడై రాజమందిరమునఁ జిరకాలము నివసించెను

ఈ సమయముననే రోమపాదునకుఁ బుత్త్రోత్పత్తి నిమిత్తమై ఋష్యశృంగుఁ డంగదేశమున నింద్రునిఁగూర్చి యొక యిష్టి చేయించెను. దానిమూలమున నింద్రుఁడు ప్రీతుఁడై రోమపాదునకుఁ బుత్త్రుఁ డుదయింప వరమిచ్చెను. తరువాత ఋష్యశృంగుని యాశీర్వచనముచే రోమపాదునకుఁ బుత్త్ర సంతానము కలిగెను. నాఁటినుండి రోమపాదుఁడు దినదినవర్ధమాన మగు భక్తి తాత్పర్యముతో ఋష్యశృంగుని శాంతను బూజించుచు వారి యడుగులకు మడుఁగు లొత్తుచుండెను.[1]

శాంతా ఋష్యశృంగు లయోధ్య కేఁగుట

ఇంతలో నయోధ్యానగరమున దశరథునిచేఁ బుత్త్ర కామేష్టిఁ జేయింపఁ దలంచి వశిష్ఠమహర్షి సనత్కుమారుఁడు తొల్లి చెప్పిన వృత్తాంత మంతయుఁ జెప్పి దశరథునిఁ బ్రేరేపించెను. దశరథుఁ డానందముతో వసిష్ఠుని బూజించి చతురంగ బల సమేతుఁడై యంగ దేశమునకు ఋష్యశృంగుని గొనివచ్చుటకు బయలు దేఱెను. సచివులును దాను నంగదేశము సొచ్చి దశరథుఁడు రోమపాదునింటి కేఁగి దీప్తాగ్నివలెఁ దేజరిల్లుచున్న ఋష్యశృంగుని దర్శించి యనేక

  1. భారతము - అరణ్యపర్వము.