పుట:Maharshula-Charitralu.firstpart.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48

మహర్షుల చరిత్రలు


శిరసావహించి వివాహమాడఁ గృతనిశ్చయుఁ డాయెను. అంత నష్టావక్రుఁడు దనకుఁ దగినకన్నియ యెవతె యని యాలోచించి వదాన్యమహర్షి తనూజ యగు సుప్రభను వివాహము కాఁదలఁచి వదాన్యు నాశ్రమమునకుఁ బోయెను.

వదాన్యుఁ డష్టావక్రునికీర్తిచంద్రికలు కాంచినవాఁడయ్యు నాతని నింకను బరీక్షింపఁ గోరియుండెను. తనకడకు రాఁగానే యష్టావక్రు నాతఁడు గారవించి వచ్చినపని యడిగెను. అష్టావక్రుడు సుప్రభను వివాహ మొనరింపఁ గోరెను. వదాన్యుఁ డంగీకరించెను. కాని యాతనిఁ బరీక్షింపఁ గోరి "అష్టావక్రా! నీవంటి యుత్తమునకుఁ బిల్ల నిచ్చుటకంటెను నాకుఁ గావలసిన దేమున్నది? కాని, నా కూతును వివాహమాడఁ గోరువాఁడు ముందుగా నుత్తరదిశకుఁ బోయి కుబేరుని నగరమును దాఁటి హిమగిరిపైనున్న పార్వతీపరమేశ్వరులఁ బూజించి మఱియు నుత్తరమునకుఁ బోఁగాఁ గాననగునీ పవనమును గని యందు సువర్ణనిర్మిత మైన సౌధములతో నున్న నగరమును బరిపాలించు రమణిని జూచి యామె యాశీర్వచనమంది రావలయును. అప్పుడు సంతోషముతో నాకొమార్తె యగు సుప్రభ నిచ్చి విహహము చేయుదు" నని చెప్పెను. ఇది యెంతపని యని పలికి యష్టావక్రుఁడాపనికై బయలుదేఱి పోయెను.

అష్టావక్రుఁడు పర్వతములను నదులను దాఁటుచుఁ బయనించు చుండెను.. ప్రకృతిరామణీయకముఁ దిలకించుచు నతఁడు నిజమాన సబంభరమును బరమేశ్వరుని పాదారవిందములపై వ్రాలఁ జేయుచు బాహుదానదిఁ గాంచి యం దవగాహితుఁడై యొకదిన మందుఁ గడపి యలకాపురమార్గమును బట్టెను. కుబేరుఁ డష్టావక్రునిరాక యెఱిఁగి వాని కెదురువచ్చి సమాదరముతోఁ బుష్పకారూఢునిఁ జేసి యలకానగరమునకుఁ దీసికొనిపోయెను. అచ్చట బహురమణీయ