పుట:Maharshula-Charitralu.firstpart.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

మహర్షుల చరిత్రలు


"మహాత్మా! నీవు విష్ణుఁడవు. ఆద్యుఁడవు. నీతో నున్న యీమె యిందిర. నీవు సత్యజ్ఞానానందస్వరూపుఁడవు. నీకు విధినిషేధములు లేవు. నీ కన్న సర్వసమర్థుఁ డింకొకఁడు లేఁడు. మమ్ము రక్షింపు"మని వేఁడుకొనిరి. అంత దత్తాత్రేయుఁడు కరుణించి “నన్ను మీరు తెలిసికొంటిరి. దేవహితముకంటె నాకుఁ గావలసిన దేమి? మీరా దైత్యులను యుద్ద వ్యాజమున నిటకుఁ దోడితెండు. క్షణమాత్రములో వారిఁ బరిమారు" నని వారిని బరిపివేసెను.

దేవత లొక్కపరుగునఁబోయి జంభాదులను యుద్ధమునకు, బిలుచుకొని వచ్చిరి. జంభుఁడు ససైన్యుఁడై దత్తాత్రేయు నాశ్రమమునకు వచ్చి దత్తాత్రేయుని పార్శ్వమున నున్న లక్ష్మిని జూచి కామమోహితుఁడై నెమ్మదిగా నామెను దొంగిలించి శిబికలో నెక్కించుకొని మోయుచుఁ గొనిపోఁ జొచ్చెను. దత్తాత్రేయుఁ డింద్రాదులఁ బిలిచి “లక్ష్మి దానవుల శిరమెక్కినది. అనఁగా నింక వారిని విడిచి వేయు నన్నమాట. దాని మూలమున దైత్యులందఱు బలహీనులై రి. మీరు యుద్ధము ప్రారంభించి వారిని దునుమాడుఁ" డని చెప్పెను. దేవతలు పూర్వమువలెఁ గాక క్షణములో రాక్షసు లెల్లరఁ జంపి దత్తాత్రేయుని స్తుతించి వెడలిపోయిరి.

దత్తాత్రేయుఁడు కార్తవీర్యార్జునుఁ గటాక్షించుట

ఆ దినములలో హైహయవంశీయుఁడగు కార్తవీర్యార్జునుఁ డను రాజు తండ్రి మరణానంతరము సింహాసన మధిష్ఠించి రాజ్య పరిపాలన మొల్లక మంత్రులఁ బిలిచి “మంత్రులారా! ఈ రాజ్యము నాకక్కఱలేదు. పరస్పర ద్వేషతస్క రాది బాధలనుండి కాపాడుటకై ప్రజలు ధరణిపతికి ధనము చెల్లింతురు. నే నాపనులు చేయఁజాలను. వనమున కరిగి తప మాచరించి యధ్యాత్మయోగసిద్ధి పొంది వచ్చెద" నని చెప్పెను. అందు గర్గుఁ డను మంత్రిపుంగవుఁడు రాజుమాట