పుట:Maharshula-Charitralu.firstpart.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తాత్రేయ మహర్షి

123


గలరా? యోగి నెఱుఁగుట యోగికే సాధ్యము కాని యితరులకు సాధ్యము కాదుకదా! [1]

దత్తాత్రేయుఁడు జంభాది రాక్షసులఁ జంపించుట

ఇట్లుండఁగా జంభాది రాక్షసప్రముఖు లింద్రునిపై దండెత్తి దేవతల నోడించుచు ననేకవిధముల బాధలు పెట్టుచుండిరి. ఒక సంవత్సర మా రాక్షసులతోఁ బోరాడియు దేవతలు గెలువ లేకుండిరి. అందుచే నింద్రాదులు భయపడి వాలఖిల్యాది మహర్షులఁ గూడి తమ గురువగు బృహస్పతికడ కేఁగి యుపాయము చెప్పుమని కోరిరి. బృహస్పతి యాలోచించి "ఇంద్రాది దేవతలారా ! నా కొక యుపాయము తోఁచుచున్నది. అత్రిమహర్షి కుమారుఁడు దత్తాత్రేయుఁడను మహాత్ముఁడు కలఁడు. మీరుపోయి వానిని భక్తితో సేవించి భజించినచో నాతఁడు మీకుపకారము చేయఁగలడు. అంతకుమించి గత్యంతరము కానవచ్చుటలే "దని చెప్పఁగా వెంటనే యింద్రాదులు గురుననుమతిఁ గైకొని యతివేగమున బయలు దేఱిపోయి దత్తాత్రేయనాశ్రమమును సమీపించిరి.. అట నాతఁ డనేక కిన్నర గంధర్వగీయమానుఁడై లక్ష్మిసమన్వితుఁడు తేజస్సముజ్జ్వలుఁడునై యుండఁగాంచి దేవత లతి భక్తి యుతులై మ్రొక్కిరి. దత్తాత్రేయుఁడును దన వికృతచేష్టలఁ జూవుచు మద్యము తెండనఁగా వారు మధ్యముఁ గొనివచ్చి యాతని కందిచ్చిరి. అతఁడు లక్ష్మితో దానిం ద్రావి గంతులువేసి పాఱిపోఁ జొచ్చెను. ఇంద్రాదులును వానిని వెనుదగిలి విడువకుండిరి. వారిచే నట్లారాధింపఁబడుచు దత్తాత్రేయుఁడు కరుణించి "మీ రేపనికై వచ్చితి? " రని యడి గెను. వారును జంభాసురుని వృత్తాంతము చెప్పి రాక్షసుల నందఱను జంపి దేవహితము చేయుమనియాతనిఁ బార్థించిరి ఆతఁడు "నేను మద్యాసక్తుఁడను, స్త్రీలోలుఁడను, కర్మభ్రష్టుఁడను, ఉన్మత్తుఁడను, నాకారాక్షసుల గెలువరాదు. పొం”డనెను. వారు

  1. మార్కండేయ పురాణము.