పుట:Maharshula-Charitralu.firstpart.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

మహర్షుల చరిత్రలు


తద్వైకల్యము కలిగినను నూరకుంటివి. ఇది శాంతమగునే? సమయా సమయముల నెఱిఁగి చూపినదే శాంతము. వలయునెడఁ గోపించినను నది శాంతసమానమే యగును. ఆసమయమున శాంతము చూపినను దోష మే యగును. కావున నీ వొనరించిన దోషమునకు నీవు ప్రతిఫల మనుభవించి తీరవలెను. కావున, నీవు ముంగివై పుట్టు" మని శపించిరి. జమదగ్ని వారలకు దండప్రణామములు చేసి “మహాత్ము లారా ! తపస్వికి నలుగఁ దగదని యపరాధము చేసినను నలుగనైతిని. నా తప్పు నా కిప్పుడు తెలిసినది, కావున, నన్ను సైచి శాపమోక్షము ననుగ్రహింపుఁ " డని కోరెను. వారు 'నాయనా ! నీమీఁద మాకుఁ గ్రోధము లేదు. ఎంతటి వానికిని గర్మఫలమనుభవింపక తప్పదు కదా! నీకు నంతియే. కావున, నీవు నకులమై పుట్టుట తప్పదు. ఎప్పుడు విదగ్ధవిప్రసమూహ మంగీకరించు నుచిత వాక్యములతో నొక మహాధర్మము కీ డని నీవందువో యానాఁడు నీకు శాపమోచనమై మోక్ష సౌభాగ్యమందఁగల"వని చెప్పి పితృ దేవత లదృశ్యులైరి. ఆ శాపము మూలముననే ముంగియై పుట్టి ధర్మరాజు చేసిన యశ్వమేధయాగ సమయమున సక్తుప్రస్థుని యుదాహరణమున ధర్మజు నశ్వ మేధము నధిక్షేపించి విగతశాపత్వానందమున జమదగ్ని మహర్షి జన్మరాహిత్యము నందఁగనెను.[1]

ఇట్లు జమదగ్ని మహర్షి మహాప్రశాంతుఁడై , అరిషడ్వర్గముల జయించి యాత్మానందసింహాసనాధిష్ఠితుఁ డై వెలసెను.  1. భారతము - ఆశ్వమేధపర్వము.