పుట:Maharshula-Charitralu.firstpart.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జమదగ్ని మహర్షి

119


పరశురాముఁడు వచ్చి తండ్రి మరణమునకు విచారించెను. పిమ్మటఁ దల్లి యిరువదియొక్క మాఱులు పిలిచినది. కావున నిరువదియొక్క మాఱు కార్తవీర్యులనే కాక క్షత్రియుల నెల్లరను సంహరించి వారి రక్త ప్రవాహమునఁ దండ్రికిఁ దర్పణము లిత్తునని పరశురాముఁడు సోదరుల నూఱడించి బయలుదేఱి వెడలి యిఱువదియొక్కమాఱు వెదకి వెదకి రాజులఁ జంపెను. ఈ లోపున రేణుకాదేవి భర్తకై ప్రాణములఁ బాసెను. పరశురాముఁడు తాను జేసిన ప్రతిజ్ఞను బాలించి క్షత్రియ రక్తముతోఁ దండ్రికిఁ దర్పణము విడిచిపెట్టెను. ఉత్తమోత్తముఁడు పితౄణవిమోచకుఁడు నగు పరశురామునివంటి పుత్త్రరత్నమును గాంచిన యా మహర్షి సత్తముని యదృష్టవిశేష మెంతటిదో కదా ![1]

జమదగ్ని పితృదేవతల శాపమున నకులమై పుట్టిన వృత్తాంతము

జమదగ్ని మహర్షి యొకనాడు పితృకార్యార్థియై చాల నియమముతో నూతన కలశమున గోక్షీరమును స్వయముగాఁ బితికి యొకచోటఁ బదిలముగాఁ బెట్టెను. జమదిగ్ని మహాప్రశాంతుఁ డగుట నాతని చిత్తవృత్తి యెఱుఁగఁ దలఁచి , క్రోధాధిదైవము సాకారయై వచ్చి ప్రమాద మనుభ్రమ పుట్టించి యా పాలు పాఱఁ బోసెను. జమదగ్నిమహర్షి కోపింపగ యూరకుండెను. అంతఁ గోధాధిదేవత యాతని యెదుటఁ బ్రత్యక్ మై "మహాత్మా ! భృగువంశము వారు మహాకోపు లని వింటిని. నీయం దది యసత్యమైనది. అది పరీక్షించుటకే యిట్లు చేసితిని క్షమింపు " మని వేఁడుకొనెను. జమదగ్ని శాంతచిత్తముతోఁ బొమ్మనఁగాఁ గ్రోధుఁ డంతర్థానమయ్యెను.

నాఁటిరాత్రి జమదగ్ని పితృదేవత లతనికిఁ బొడసూపి "వత్సా! నీ వెంతదోషము చేసితివి ! నీవు మాపూజ కుత్సహించి

  1. భారతము - బ్రహ్మపురాణము.