పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాజుల లక్ష్మీనర్సు శెట్టి

247



పూర్వకముగా దెలుపుకొనుటయే ధనవంతులగు వర్తకులు దొరతనమువారిక్రింద నుద్యోగములు చేయని పెద్దమనుష్యులు పలువురాసంఘములో జేరి పనిచేసిరి. ఆసంఘమువారు పలుమారు సభలు చేసి ప్రజలు పడియెడు కష్టముల జర్చించి తన్ని వారణార్థము సీమలో నున్న యధికారులకు మహజరుల నంపిరి.

ఈ శెట్టిగారి మొదటి పోరాటము క్రైస్తవమత బోధకులతో సంభవించెను, అప్పటికి గ్రీస్తు మత బోధకులు కొందఱు మనదేశమునకు వచ్చి పాఠశాలలుపెట్టి యింగ్లీషులోని శాస్త్రవిద్యలు మనవారికి నేర్పి యుపకారము చేయుచువచ్చినను పాఠశాలలోని బాలకులను దమ మతములో గలుపుకొనుచు వచ్చిరి. ఆ కాలమున మనవారిలో ననేకులు ఇంగ్లీషు రాకపోవుటచేతను రాజభాషయగు నింగ్లీషు వచ్చినగాని యుద్యోగములు దొరకకపోవుటచేతను మనవా రుద్యోగముల మీఁది యాశచేత తమబిడ్డలను గ్రైస్తవుల పాఠశాలలకే బంపవలసిన వారైరి. ఆమతబోధకులు తమబడికివచ్చిన విద్యార్థులలో మిగుల లేబ్రాయముగలవారిని సయితము స్వమతమున గలుపుకొనిరి. గొప్ప యుద్యోగములలోనున్న తెల్లదొరలందరు క్రైస్తవమతబోధకుల కీకార్యమునందు దగిన సహాయము జేసిరి. అందు ముఖ్యములగు వారి గొందర నిందు బేర్కొనుచున్నారము. తిరునల్వేలి జిల్లాకలక్టరగు థామసుదొరగారు క్రైస్తవమతబోధకులు. తమతమ వ్యాప్తికి జేయు పనులకు బహిరంగముగ జాల సహాయము చేసిరి. అందు చెన్నపట్టణము సాదరుకోర్టులో జడ్జీయగు సర్ విలియంబర్టను దొరగారు మతబోధకులమీఁద దనకుఁగల యభిమానమును స్పష్టముగ దెలుపుటయేగాక కోర్టులో ధర్మపీఠమున గూర్చున్నప్పుడు సయితము తానే హిందువులకప్పుడు క్రైస్తవమతము బోధింపజొచ్చెను. అప్పుడు గవర్నమెంటు సెక్రటరుగారగు మరియొక థామసుదొరగారు హిందు