పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
8
మహాపురుషుల జీవితములు


ఈ సంస్కారములు గాక దేశమున కతఁ డింక ననేకోపకారములు చేసెను.

హిందువులకుఁ బాఠశాలలు స్థాపించి యాంగ్లేయభాష నేర్పింపుఁడని గవర్నరు జనరలుగారగు, ఆమ్హ రష్టుప్రభువుగారి కొకయుత్తరము వ్రాయుటయేగాక, నిరువురు దొరలతో గలిసి 1817 వ సంవత్సరమున హిందూకళాశాలలు స్థాపించెను. బంగాళీ బాషలో వచన కావ్యములు వ్రాయుటకుదారితీయుటయేగాక, యాభాషలో లలితపద గర్భితములగు కృతుల ననేకములు రచించెను. ఆకృతులు వంగ దేశపు స్త్రీ పురుషు లిప్పటికిని బాడుచుందురు.

రామమోహనునకుఁ జిరకాలమునుండి యూరపుఖండమును ముఖ్యముగ నింగ్లాండుదేశమును జూడవలయునని యభిలాష యుండెను. స్వదేశమున తనతోడి ప్రజలకుఁ జేయవలసిన సత్కార్యము లనేకము లుండుటంజేసి యదివఱ కతనికిఁ బోవీలు చిక్కఁదయ్యె ! 1830 వ సంవత్సరమున నతని యభిలాషకు ననుగుణముగ నొక యదను గలిగెను. అప్పటి ఢిల్లీ చక్రవర్తి, పేరునకుమాత్రము సార్వ భౌముఁడయి యుండి యేలుటకు రాజ్యము, ననుభవించుట కైశ్వర్యములేక, తన దీనదశ నింగ్లాండులోని పార్లమెంటు మహాసభవారికిఁ దెలియఁ జేసికొనఁ గోరి తాస్వయముగఁ బోఁజాలక తనపక్షమున సీమకుఁ బొమ్మని రామమోహనుని బ్రార్థించి, యతనికి రాజా యను బిరుదము నిచ్చి, తగు ధనమిచ్చి పంపెను. తన యభిలాషకు, ఢిల్లీశ్వరుని బనికిం దోడుగ, రామమోహనునకుఁ గర్తవ్య మింకొకటి యుండెను. సహగమనము నిచ్చటి గవర్నరు జనరలుగారు మాన్పించిరను కోపమున బూర్వాచార పరాయాణులు, ప్రాఛీనమగు నాయాచారమును నిలుపుఁడని పార్ల మెంటువారికి పలుమహజర్ల నంపిరి. రామమోహనుఁడు గవర్నరుజనరలుగారు చేసినపని మంచిదనియు, నా యాచారము తుదముట్ట నిర్మూలింప వలసినదనియు, ప్రజలవలనఁ,