పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
7
రాజారామమోహనరాయలులను, సంస్కరణవిషయములును, బ్రకటించుటకయి సంబంధుకౌముది యను నొకపత్రికను స్వభాషలోఁ బ్రకటించుచు వచ్చెను. అతని ప్రతిపక్షు లందఱుఁ జేరి ధర్మసభ యనుపేర నొకసమాజము నేర్పఱచి చంద్రికయను నొకపత్రికను బ్రచురించి, రామమోహనుని నిందించుటయే ప్రధానముగఁ జేసికొనిరి. మతసంస్కారమందేగాక, సంఘసంస్క రణమునందును నాతఁడు గట్టిపనిచేసెను. స్త్రీ పునర్వివాహములు శాస్త్రీయము లనియు, నింద్యములు కావనియు, నతనియభిప్రాయము. బంగాళాదేశములో కులీనులను నొకతెగ బ్రాహ్మణులుగలరు. వారిని పరమపావనులనియచ్చటిజనులు నెక్కుడుగాగౌరవింతురు. పవిత్రులగు కులీన బ్రాహ్మణులతో సంబంధము చేయుట కడుగౌరవమని యెంచి యాదేశ బ్రాహ్మణులు తమ కన్యలకు తగు వరులు దొరకనందున, వేలకొలఁది రూప్యముల కట్నముల నిచ్చి, యొక్కొక్క కులీనునకు ముప్పది, నలువది, ఏఁబది, యొకప్పుడు నూరుమంది కన్యలను గట్టఁబెట్టెడి యాచారము గలదు. ఇట్లు వివాహము చేసికొన్న భర్త మృతినొందునప్పుడు నూరుగురుభార్యలు సహగమనము చేయవలసి యుండెను. దగ్గరనున్న వారు భర్తతోఁ గలసియు, దూరమున నున్నవారు మగనియొక్క గుడ్డపేలికయో, మరియే వస్తువో తెప్పించి మీఁద వేసికొని తమరున్న యూళ్ళలో చిచ్చురికి శరీర త్యాగము చేయుచుందురు.

రామమోహనుఁడే ముగ్గురుభార్యలనువివాహము చేసికొనెను. మొదటిభార్య చిన్నతనమందే మృతినొందుటం జేసి, ఆయన మఱి యొక కన్యను వివాహము చేసికొనెను. ఈధర్మపత్ని జీవించియున్నపుడే రామమోహనునకుఁ దండ్రిగారు మఱియొక కన్యను బాణిగ్రహణము చేయించిరి. బహుభార్యాస్వీకారమువలనఁ గలుగు నష్టములను స్వయముగఁ జూచుటఁ జేసి యాదురాచారమును నిర్మూలించుటకయి యతఁడు ప్రయత్నించెను. కాని వెంటనే కృతకృత్యుఁడు గాఁడయ్యె.