పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వారకనాథ మితర్

87

భాషగాఁ గలిగిన దొరలుసయితము ద్వారకనాథున కాభాషయందుఁ గల యభిరుచి ప్రవేశమును బట్టి మిక్కిలి యక్కజపడుచువచ్చిరి."

గొప్ప యధికారమును వహించినవారు తమ యధికార ప్రాబల్యమును జూపి తక్కువవారిని బాధపెట్టినప్పుడు ద్వారకనాథుడది చూచి సహింపక యట్టి యధికారులకు గట్టిగ మందలించు చుండును. ఇంటివద్ద యతఁడు మిక్కిలి వినయవృత్తి గలిగి సర్వజన సులభుఁడై యౌదార్యమునఁ బ్రసిద్ధికెక్కియుండెను. 1871 వ సంవత్సరమున నతని పెద్దభార్య మృతినొందెను. ఆమె కిరువురు బిడ్డలు. ప్రథమకళత్రముపోయిన మరుసటిసంవత్సరమున నతఁ డొక కన్యను వివాహమాడెను. కాని యామెను వివాహమాడిన యచిరకాలములోనే లోకాంతరగతుఁ డయ్యెను. ఆయనకు నిరంతరము చదువుకొనుటయందె మిక్కిలి యాసక్తి. చదివినది జ్ఞాపకముంచుకొనుటలో నంతవాఁడు సాధారణముగా నుండఁడు. ఒకమా రాయన కొన్ని సంపుటములు గల యూరపుదేశ చరిత్రమును పదునైదుదినములలో సమగ్రముగాఁ జదివి చదివినది తనకు జ్ఞాపకమున్నదో లేదో తెలిసికొనుట కాగ్రంథమునందు తన్నుఁ బరీక్షింపుమని యొకమిత్రునిఁ గోరెను. ఆమిత్రుఁడు పలుభాగములయందు పలుప్రశ్నలు వేయ నాప్రశ్నలకన్నిటికి తేలిపోక యుత్తరములు చెప్పుటయే గాక ద్వారకనాథుఁడు మూలగ్రంథము నందలి వాక్యములను సయితము కంఠపాఠముగ నప్పగించి మిత్రున కాశ్చర్యము గలిగించెను. యూరపుఖండమంతయు జయించిన శూరశిఖామణియగు నెపోలియన్ బోనపార్టి యందతనికి మిక్కిలి యభిమానముండుటచే నాతని ప్రతిరూపమును వానిగదిలోనుంచుకొనెను. హరిశ్చంద్ర ముఖర్జీ యనునతఁడు వాని బాల్యస్నేహితులలో నొకఁడు ఆముఖర్జీ 1868 వ సంవత్సరమున మృతినొందఁగా వానియకాల మరణమునుగూర్చి ద్వారకనాథుఁడు మిక్కిలి దుఃఖించెను.