పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

మహాపురుషుల జీవితములు

గ్రంథములపై నతనికిమిక్కిలి యభిమానము. అతని గ్రంథభాండారమున రమారమి వేయి మంచి ఫ్రెంచి గ్రంథము లుండెను.

అతనికి 1868 వ సంవత్సరమున విసూచిజాడ్యము తగిలెను. కాని యది యదృష్టవశమున గుదిరెను. 1872 వ సంవత్సరమున నతఁడు కీళ్ళనొప్పులు జ్వరమువలన కొన్నిదినములు బాధపడెను. తరువాత జ్వరము వదలినను దానిదోషములు విడువవయ్యెను. 1873 వ సంవత్సరము నవంబరు నెలలో నాయనకు కంఠములో కురుపువేసెను. అట్లుండియు నతఁడు కొంతకాలము పని చూడఁగలిగెను. కాని క్రమ క్రమంబుగ రోగము ప్రబలమగుటచే నతఁడు పనిమానుకొని ప్రాణమునం దాశవదలుకొని కలకత్తానగరమును విడిచి తన కడపటిదినములు పుచ్చుటకు స్వగ్రామముఁ జేరెను. అట్లు కొంతకాలము రోగపీడితుఁడై 1874 వ సంవత్సరం ఫిబ్రేవరు 25 వ తేదీని నలువదియవయేట కాలధర్మము నొందెను.

న్యాయాధిపతిగాఁ గూర్చునప్పు డతఁడు ప్రజలకు సరిగా న్యాయమునొసఁగి హిందువులుకూడ న్యాయాధిపత్యము చేయుటకుఁ దగు సామర్థ్యము జ్ఞానముగలవారని దొరతనమువారికిఁ దోచునట్లు ప్రవర్తించెను. అతని మరణమును గూర్చి విచారించుచు తోడి న్యాయాధిపతి యొకఁ డీవిధముగాఁ జెప్పెను. "అతని యధికవైదుష్యము యుక్తాయుక్త వివేచనజ్ఞానము న్యాయదృష్టి బుద్ధికుశలత యద్భుతమైన జ్ఞాపకశక్తి మంచితనము మొదలగుగుణములం బట్టి యతఁడు తోడిన్యాయాధిపతులకు సాటిలేని సహకారిగా నుండును. అతనితో గూర్చుండి పనిచేయుట మిక్కిలి సంతోషకరముగా నుండును. ఇంగ్లీషుభాష యందలి యతని పాండిత్యమును జూడ నాభాషయతనికి విధేయురాలై యున్నట్టు గనఁబడును. ఇంగ్లీషుభాషను మాతృ