పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


సూత్రములను ధరించి ధర్మబుద్ధితో నడిచెను. ఈ రెండు గుణము లతనికి లేకపోయినను ధనము విశేషముగ కలవాఁడైనందున, గరిడీసంబరములచేతను, మల్లయుద్దములచేతను, నాటకముల చేతను . ప్రజల నతఁడు రంజింపచేసెను. అతఁడు పురజనులకు కూర్చిన బహుమానములలో నేకశివాప్రతిమ నేఁటివఱకు గానఁబడుచున్నది.

'డీలాస'ను నొక ద్వీపములో 'అపాలో' యను పేరుగల సూర్యదేవతాలయ మొకటి కలదు. అక్కడ ప్రతిసంవత్సర మొక మహోత్సవము జరుగుచుండును. అక్కడకు దేశదేశములనుండి మనుజులు వెళ్లుటకలదు. ఒక సంవత్సరము 'ఆథెన్సు' పట్టణమునుండి కానుకలను బలులను బట్టుకొని గాయకులతో నుత్సవమునకు వెళ్లుటకు ప్రజలు నిసియస్సును నియోగించిరి. అతఁ డక్కడకుఁ బోయి వానిని సమర్పించి యక్కడ ౙరిగిన వినోదములలో గొంతకాలము గడిపెను. అయిదువేల రూప్యముల కొక భూమిని కొని దాని నతఁడు భోగరాగాదులకు దేవున కిచ్చెను.

అతఁ డటుల చేయుట డాంబికమునకుఁ గాదు. నిజమైన భక్తికలవాఁడు. దేవతిర్యఙ్మనుజులనిన నతనికి భయము. ప్రతి దినమున నతఁడు హోమముచేయుట కలదు. అతనికి వెండిగని కలదు. అందులో ననేక పనులను జేయుచుండిరి. అతనికి విశేషముగ భృత్యవర్గము కలదు. రాబడి మెండుగ నుండెను.