పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


చున్నందున, ప్రతిదానిలో నతఁడు శౌర్యమును గనపఱచి బహూకరింపఁ బడుచుండెను. ఒకదానికంటె నొకటి యధిక మయ్యెను. పరులు కీర్తిని సంపాదించుటకు ధైర్యమును జూపిన, తల్లికి సంతోషముఁ గలుగఁజేయుట కతఁడు శౌర్యముఁ జూపెను. ఆమె యాజ్ఞానుసార మతఁడు పెండ్లియాడి భార్యా పుత్రాదులతో నామె యింటనే యుండెను. .

ఈ సమయములో 'సెనేటు' సభవారికిని . బ్రజలకును నంతః కలహములు పుట్టెను. ఋణదాతలు ఋణగ్రస్తులను బాధించుచుండిరి. అందుచేత ఋణగ్రస్తులు యుద్దములో సహాయము చేయ మనిరి. వారి బాధలను నివృత్తి చేసెదమని సభవారు చెప్పి, వారిని యుద్ధమునకుఁ దీసికొనిపోయి, తదుపరి వారి మాటప్రకారము సహాయముఁ జేయనందున వా రొక్కుమ్మడి రోముపట్టణము వదలి పైదేశములకుఁ బోవ యత్నించిరి. వారిని శాంతముఁ జేయవలసినదని కొందఱును, కూడదని కోరియలేనస్సు మొదలగువారును సభవారికి సలహా యిచ్చిరి. సభవా రేమిచేయుటకుఁ దోఁచక 'అగ్రిప్పా' యనువానిని సంధిచేయుటకు ప్రజలయొద్దకుఁ బంపిరి. 'అగ్రిప్పా' వారికి ప్రశాంతివచనములఁ జెప్పి, "పూర్వకాలమున నవయవములన్నియు జీర్ణకోశముపై తిరుగఁబడెను. అది సోమరిగ నుండుటయు, పనిపాటలు తాము చేయుటయుఁజూచి కినిసి యవి తమతమపనుల మానివేసెను. కొంతకాలమున కవియు జీర్ణిం