పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


మీఁదికి వచ్చెను. కొంతవఱ కాంతొని శేషించిన సైన్యము సాయమున వారితోఁ బోరాడెను గాని కార్యము లేకపోయెను. ఇంతలో రాణిచెప్పినప్రకార మామె చనిపోయిన దని భృత్యు లతనితోఁ జెప్పిరి. అదివిని, యతఁడు కలఁతఁజెంది, తనను కత్తితోఁ బొడిచి చంపవలసినదని దగ్గఱనున్న పరిచారకుని వేఁడెను గాని, వాఁ డటులచేయలేక, కత్తితోఁ బొడుచుకొని చచ్చెను. వాని ధైర్యమునకు మెచ్చి, యతఁడు తల్వారు తీసికొని దానిని తన కడుపులో గ్రుచ్చుకొనెను గాని, యతఁడు చావలేదు. శ్రమనివారణఁ జేయవలసినదని పరిచారకుల నతఁడు వేఁడెనుగాని, వా రతనిని జంపలేకపోయిరి. రాణి బ్రతికియున్నదని చెప్పి, వా రతని నామెయొద్దకు మోసికొని పోయిరి.

ఇంతకు పూర్వ మామె సునాయాసముగ మరణము నొందుట కుపాయములను బరికించి, వానిలో 'ఆస్టు' యను పురుగుకాటు మంచిదని యెంచి, వానిని తెప్పించియుంచెను. అతని మరణావస్థనుజూచి, యామె యా పురుగులచేతఁ గరిపించుకొనెను. కొంతవఱకు వారుభయులు మాటలాడుచు, నొకరిచేతులలో నొకరు ప్రాణములను విడిచిరి. వీరు క్రీ. పూ, సం!! 30 రములో స్వర్గస్థులయిరి.